Chandra Babu: ఐటీ నగరం నుండి రాజధాని వరకు.. చంద్రబాబు విజన్ పై విభిన్న స్పందనలు..

హైదరాబాద్ (Hyderabad) గురించి మాట్లాడితే చాలామందికి వెంటనే గుర్తొచ్చే పేరు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu). ఆయన అనుకూల మీడియా, టీడీపీ (TDP) వర్గాలు ఆయనను విజయవంతమైన నేతగా చెప్పడం మనం తరచూ చూస్తుంటాం. హైదరాబాద్ అభివృద్ధి చెందిన తీరు, ముఖ్యంగా ఐటీ (IT) రంగంలో వచ్చిన పరిణామాలు అన్ని చంద్రబాబు విజన్ వల్లే సాధ్యమయ్యాయని వాళ్లు చెబుతుంటారు. కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా బాబును పొగడ్తలతో ముంచెత్తుతుంటారు.
ఇటీవల విజయవాడ (Vijayawada) లో జరిగిన ఓ పుస్తక ఆవిష్కరణ సభలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఆయనను “మహా నాయకుడు”గా వర్ణించారు. విద్యార్థి దశ నుంచే ఆయన శ్రమించి ఎదిగిన తీరు, ఆయన్ను ఎంతో గొప్పగా తీర్చిదిద్దిందని చెప్పారు. ముఖ్యంగా ఐటీ రంగాన్ని హైదరాబాద్‌లో అభివృద్ధి చేయడంలో ఆయన పాత్రను చిరు గుర్తు చేశారు. ఆయన ముందు చూపుతోనే ఈ రంగం బలోపేతమైందని చెప్పారు. అంతే కాకుండా, హైదరాబాద్ అన్ని రంగాల్లో పురోగమించడానికి బాబు వేసిన బాట వల్లే సాధ్యమైందని అన్నారు.
అయితే హైదరాబాద్ అభివృద్ధిని పూర్తిగా ఒక్క చంద్రబాబుకే క్రెడిట్ ఇవ్వాలా అనే విషయంలో మాత్రం అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ నగరానికి చరిత్ర నాలుగు వందల ఏళ్లది. మొఘల్ (Mughal) కాలం నుంచి నిఖార్సైన అభివృద్ధి బాటలో ముందుకెళ్తూ వచ్చిన నగరం ఇది. ఇలాంటి ప్రాంతాన్ని ఇంకా నూతన దిశలో నడిపించడంలో చంద్రబాబు పాత్ర తప్పనిసరిగా ఉంది. కానీ అది పూర్తిగా ఆయనవల్లేనని మాత్రం చెప్పలేం. అంతేకాక బెంగళూరు (Bengaluru), చెన్నై (Chennai), ముంబై (Mumbai) లాంటి ఇతర నగరాలూ అదే కాలంలో ఐటీ రంగంలో ఎదిగాయి. మరి అక్కడ విజినరీ లీడర్షిప్ ఎవరిది అన్నదీ ఓ ప్రశ్నగా మారింది.
ఇక చంద్రబాబు అమరావతిని (Amaravati) రాజధానిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా అది ఇప్పుడు పెద్దగా ఫలించినట్లు కనిపించకపోవడం, చాలా మందిలో సందేహాలు రేకెత్తిస్తోంది. హైడెవలప్‌డ్ నగరంగా ఉన్న హైదరాబాద్‌ను మరింత ముందుకు నడిపించడం ఓకే, కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాన్ని పూర్తి రాజధానిగా మార్చడం అంత తేలికకాదని చాలామంది అభిప్రాయం. అమరావతిలో బాబు చూపిన విజన్ ఇంకా ఆచరణ రూపంలోకి రాకపోవడాన్ని కొంతమంది విమర్శిస్తున్నారు. అయినా హైదరాబాద్‌లో ఆయన చేసిన ప్రస్థానం ఒక మైలురాయిగా నిలిచిందనడం మాత్రం కచ్చితమే. అమరావతి విషయంలో అది ఇంకా ప్రయాణం మొదలవుతున్న దశలో ఉందనడంలో సందేహం లేదు.