Super Six: మహిళలకు ఉచిత బస్సు..విపక్షాల విమర్శల మధ్య ప్రభుత్వం యూటర్న్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల కోసం ప్రారంభించబోతున్న ఉచిత బస్సు ప్రయాణంపై (Free bus scheme) ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో (Super six) ఒకటైన ఈ పథకం, వచ్చే ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. మొదట ఈ పథకం ఉమ్మడి జిల్లాల పరిధిలో మాత్రమే వర్తిస్తుందని సమాచారం వచ్చింది, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. ఇప్పుడు రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా, ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాల్లో ప్రధానమైనది, జిల్లా పరిమితి వల్ల వచ్చే ప్రజా వ్యతిరేకత అని చెబుతున్నారు. కొన్ని గ్రామాలు జిల్లా సరిహద్దులకు సమీపంలో ఉండటంతో, పక్క గ్రామాలకు వెళ్లాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడేది. దీంతో విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముందస్తుగా స్పందించి, ఈ పరిమితిని తొలగించింది. మొదట ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే ప్రయాణం ఉచితం అన్న ప్రకటనలపై తీవ్ర విమర్శలు రావడంతో, ప్రభుత్వం వ్యూహాన్ని మార్చక తప్పలేదు.
ఈ మేరకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) , ఏపీ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుందని ప్రకటించారు. జిల్లా పరిమితి వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందుకే పథకాన్ని రాష్ట్ర స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వివరించారు. ప్రభుత్వం దీన్ని తలచుకుని తొందరపాటు లేకుండా, అన్ని అంశాలపై పూర్తి అవగాహనతో ముందుకు వెళ్తోంది.
ఇక పొరుగు రాష్ట్రాల్లో ఈ తరహా పథకాలు అమలు చేసినా, సరైన ప్రణాళిక లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల అక్కడ కొన్ని సమస్యలు ఎదురయ్యాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, ఏపీలో మాత్రం ముందుగా సుదీర్ఘ అధ్యయనం చేసిన తరువాతే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారని చెబుతున్నారు. పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికే మూడు రకాల ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.
విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం ముందుగానే స్పష్టత ఇవ్వడం ద్వారా రాజకీయంగా కూడా మైలేజీ దక్కించుకోవాలని చూస్తోంది. ప్రజల్లో గందరగోళం నెలకొనకుండా స్పష్టమైన ప్రకటనతోనే ప్రభుత్వం ప్రజల మద్దతు పొందాలని భావిస్తోంది. మరి దీని పై వైసీపీ (YCP) నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి..