Free Bus: మహిళలకు ఉచిత బస్సు ..ప్రయోజనాలతో పాటు ప్రభుత్వానికి పెరుగుతున్న ఆర్థిక భారం
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు పాలనలో పెద్ద సవాలుగా మారతాయన్నది తెలిసిందే. అలాంటి హామీల్లో భాగంగా ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. టీడీపీ (TDP) కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ (Super six) హామీల్లో ఇది ఒకటి. ఈ పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. ఇప్పటికే నాలుగు నెలలకుపైగా ఈ పథకం కొనసాగుతోంది. అయితే ప్రయోజనాలతో పాటు ఆర్థిక భారం కూడా ప్రభుత్వం ఎదుర్కొంటోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ (APSRTC) పరిధిలో పల్లె వెలుగు (Palle Velugu), అల్ట్రా పల్లె వెలుగు (Ultra Palle Velugu), సిటీ ఆర్డినరీ (City Ordinary), మెట్రో ఎక్స్‌ప్రెస్ (Metro Express), ఎక్స్‌ప్రెస్ (Express) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. దీంతో గ్రామాల నుంచి పట్టణాల వరకు మహిళలు ఎలాంటి టికెట్ ఖర్చు లేకుండా బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ పథకం కొనసాగాలంటే ఏటా సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతలుగా నిధులు విడుదల చేసింది. మొదట నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయగా, తాజాగా మరో ఎనిమిది వందల కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. మొత్తం కలిపి ఇప్పటివరకు దాదాపు 1200 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించారు. ఈ నిధులు రావడంతో ఆర్టీసీకి ఊరట లభించింది. ఉద్యోగుల జీతాలు, డీజిల్ ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయాలను భరించేందుకు ఈ డబ్బు ఉపయోగపడుతోంది.
ఈ పథకం రీయింబర్స్మెంట్ విధానంలో అమలవుతోంది. మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ ఇస్తూ, వారి ప్రయాణ వివరాలను డేటాగా నమోదు చేస్తున్నారు. నెలకు ఎంత మంది మహిళలు ప్రయాణించారు, ఎంత ఖర్చు అయింది అనే వివరాలు ప్రభుత్వానికి చేరుతున్నాయి. సగటున నెలకు దాదాపు రెండు వందల కోట్ల రూపాయల మేర ఈ ఉచిత ప్రయాణాల ఖర్చు ఉంటుందని అంచనా. ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి తిరిగి చెల్లిస్తోంది.
అయితే అమలులోకి వచ్చాక ఈ పథకంపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నప్పటికీ, సౌకర్యాల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా చోట్ల బస్సులు ఆగడం లేదని, ఆగినా కొందరు కండక్టర్లు విసుగ్గా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. మరోవైపు రద్దీ పెరగడంతో పురుషులకు సీట్లు దొరకడం కష్టమవుతోంది. దీంతో ఉద్యోగులకు, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొత్తంగా చూస్తే ఈ పథకం ఇంకా బాలారిష్టాలు దాటలేదని పరిశీలకులు అంటున్నారు. రద్దీ ఉన్న మార్గాల్లో అదనపు బస్సులు నడపడం, ప్రతి బస్ స్టాప్‌లో కచ్చితంగా బస్సులు ఆగేలా చూడడం, సిబ్బందికి సరైన అవగాహన కల్పించడం జరిగితే మహిళలకు ఉచిత బస్సు పథకం నిజమైన ప్రయోజనం అందిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.






