ఈ నెల 27న కడప ఉక్కుకు శంకుస్థాపన
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలోని కంబాలదిన్నెలో డిసెంబరు 27న ఉదయం 11 గంటలకు ఉక్కు కర్మాగార నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపామని చెప్పారు. వెలగపూడిలోని సచివాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కేంద్ర మోసం చేసిందని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వమే రాయలసీమ ఉక్కు సంస్థను ఏర్పాటు చేసిందని వివరించారు. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీఎండీసీ పనులు చేపడుతుందని, మున్ముందు ప్రైవేటు సంస్థలు ముందుకువస్తే నియమ నిబంధనల ప్రకారం అప్పుడు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి కంపెనీలపై ఈడీ దాడులు కేంద్ర కక్ష్య సాధింపు చర్యలో భాగమేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీనిపై న్యాయపరంగా పోరాడతానని సుజనా ప్రకటించారని గుర్తు చేశారు.













