కాంగ్రెస్ పార్టీకి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత కిశోర్ చంద్రదేవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా కురుపాంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్‌ను వీడడం బాధతో కూడిన నిర్ణయమే అయినా ఇది అనివార్యమైందని పేర్కొన్నారు. 45 ఏళ్లు కాంగ్రెస్‌లో పనిచేశానని, ఈ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని, మంత్రిగా ఉన్నప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలే ఇందుకు దారితీశాయని అన్నారు. భవిష్యత్తులో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలను నిలువరించేందుకు జాతీయ స్థాయిలో తనవంతు కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. విభజన జరుగుతున్నపుడు తాను చేసిన సూచనలు కాంగ్రెస్ పాటించలేదని ఆక్రోశించారు. విభజన తర్వాత రాష్ట్రానికి ఏం కావాలో వాటిని చట్టంలో మాత్రమే పొందుపరిచారన్నారు. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడ్డ చరణ్‌సింగ్ ప్రభుత్వంలోను, మన్మోహన్సింగ్ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వంలోను కిశోర్ చంద్రదేవ్ మంత్రిగా పనిచేశారు.













