వైకాపాలో కేంద్ర మాజీ మంత్రి
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైకాపాలో చేరనున్నారు. తన భర్త రామ్మోహన్రావుతో కలిసి హైదరాబాద్ లోటస్పాండ్లో వైకాపా అధ్యక్షుడు జగన్ను ఆమె కలిశారు. అనంతరం కృపారాణి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలనే జగన్ ఆలోచనల పట్ల ఆకర్షితురాలినై వైకాపాలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 28న అమరావతిలో జగన్ సమక్షంలో వైకాపాలో చేరనున్నట్లు ఆమె సృష్టం చేశారు. తాను పదవులేమీ ఆశించి పార్టీలోకి రావడం లేదని, జగన్ నాయకత్వాన్ని బలపరిచేందుకు తన వంతు సాయంగా కృషి చేస్తానని చెప్పారు. పార్టీలో అందరితో కలిసి పనిచేసేందుకు తన వంతుగా ప్రయత్నిస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. 2009 ఎన్నికల్లో కృపారాణి శ్రీకాకుళం జిల్లా లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు. అనంతరం యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.













