తెదేపాకు తోడుగా ఉంటా: వంగవీటి రాధా
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం ఆయన తెదేపాలో చేరనున్నారు. సోమవారం రాత్రి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కలిసి తెదేపా అధినేత చంద్రబాబుతో భేటీ అయిన రాధా.. మంగళవారం మధ్యాహ్నం మరోసారి సీఎంతో సమావేశమయ్యారు. వైకాపాను వీడిన ఆయన తెదేపాలో చేరతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ ఆయన బుధవారం తెదేపాలో చేరనున్నారు.
ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ.. పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. తన తండ్రి వంగవీటి రంగా ఆకాంక్షను సీఎం నెరవేర్చారని, అందుకే తెదేపాకు తోడుగా ఉండాలని తాను నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. నియంతృత్వ స్వభావం ఉన్న వ్యక్తి చేతుల్లోకి అధికారం వెళ్లకూడదన్నారు. పేదల కోసం నిందలు మోసేందుకైనా తాను సిద్ధమన్నారు.













