అందుకే వైకాపాకు రాజీనామా : శత్రుచర్ల
రాష్ట్రంలో వైకాపా నియంతృత్వ పోకడలు నచ్చక ఆ పార్టీని శాశ్వతంగా వీడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు వెల్లడించారు. ఆయన ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మామయ్య, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు సోదరుడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ఓటు వేయకపోతే పింఛన్లు, ఇళ్లు తదితర సంక్షేమ పథకాలు వర్తించవని బహిరంగంగా వాలంటీర్ల ద్వారా పార్టీ నాయకులు చెప్పించారని ఆరోపించారు. ఇది సరైన విధానం కాదు. నలభై ఏళ్ల తన రాజకీయ జీవితంలో రాజకీయ దాడులు, బెదిరింపులు ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ప్రస్తుత ప్రభుత్వ తీరుతో రాష్ట్రం అథోగతి పాలవుతోంది అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు నన్ను బాధించడంతోనే పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. త్వరలో కార్యకర్తలు, అనుచరులతో సమాలోచనలు చేసి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.













