టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఇకలేరు
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి (67) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1950 డిసెంబర్ 25న నెల్లూరులో జన్మించిన ఆయన వీఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. నెల్లూరు మున్సిపల్ చైర్మన్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సహకార అభివృద్ది బ్యాంకు చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. 1999 నుంచి వరుసగా మూడుసార్లు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగు కావడంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తరువాత 2015 డిసెంబర్లో ఆనం సొదరులు తెలుగుదేశం పార్టీలో చేరి చురుకైన పాత్ర పోషించారు.
ఆనం వివేకానందరెడ్డి గత ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. రేపు నెల్లూరులో వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఆనం వివేకా మృతిపట్ల ప్రముఖుల సంతాపం :
ఆనం వివేకానందరెడ్డి మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు నారా లోకేష్, కళా వెంకట్రావు, అమర్నాథ్రెడ్డి, సహా పలువురు ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.













