తెలంగాణ నేతకు.. ఏపీలో ఎంపీ టికెట్
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు. ఈ జాబితాలో 13 మంది ఎంపీ అభ్యర్థులు, 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. అందులో తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిది, మాజీ డీజీపీ కృష్ణ ప్రసాద్‌ను బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌ను కృష్ణ ప్రసాద్ ఆశించారు. అయితే ఆయనకు టికెట్ దక్కలేదు తాజాగా లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారు. రెండు జాబితాలో 15 మంది అభ్యర్థులను ప్రకటించిన హైకమాండ్ వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. చివరకు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి కృష్ణ ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు.













