మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు… బెయిల్ మంజూరు
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించిన న్యాయస్థానం, సీబీఐ కోర్టు తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంత ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబరు 16కు వాయిదా వేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ను మోసం చేసిన కేసులో కొత్తపల్లి గీతతో ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు సీబీఐ న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కొత్తపల్లి గీత దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు బ్యాంకు అధికారులు బీకే జయప్రకాశన్, కేకే అరవిందాక్షన్‌కూ ఐదేళ్ల జైలు శిక్ష వేసింది. విశ్వేశ్వర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.2 లక్షల జరిమానా విధించింది.













