మాజీ డిప్యూటీ సీఎంపై చీటింగ్ కేసు పెట్టిన మహిళ..
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ (YCP) చుట్టూ పలు వివాదాలు చుట్టుకుంటున్నాయి. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి.. వైసీపీ మాజీ నేత ఆళ్ల నాని (Alla Nani) పై చీటింగ్ కేసు (Cheating case) నమోదు అయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచార సమయంలో వైసిపి నాయకురాలు నాగమణి గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమె ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తానని అప్పట్లో ఆళ్ల నాని ఆమెకు హామీ ఇచ్చారట. అలాగే ఆమె కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని చెప్పారట. కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ ఊసే లేదని.. చెప్పినట్లుగా సహాయం చేయలేదని ఇప్పుడు నాగమణి కోర్టును ఆశ్రయించారు.
ఆళ్ల నాని తనను నమ్మించి మోసం చేశారు అని వాపోతున్న నాగమణి ఈ మేరకు కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఈ కేసులో ఆళ్ల నానితో పాటు మరొక ఏడుగురిపై ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదయింది. వైయస్ జగన్ (Y.S.Jagan) హయాంలో మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో ఆళ్ల నానికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా పదవి దక్కింది. అలాగే కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఆళ్ల నాని వ్యవహరించారు. అయితే రెండో విడత మంత్రివర్గ విస్తరణలో మాత్రం నానికి పదవి దక్కలేదు.
దీంతో అప్పటినుంచి పార్టీపై కాస్త మనస్థాపన చెందిన నాని.. కొద్దిరోజుల క్రితం వైసీపీకి గుడ్ బై చెప్పారు. ప్రస్తుత మతన నిర్వహిస్తున్న ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి పదవితో పాటుగా ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా ఆయన రాజీనామా చేశారు. కేవలం వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలా పార్టీ నుంచి బయటికి వచ్చారా లేదో ఇలా ఇప్పుడు ఆళ్ల నాని పై చీటింగ్ కేసు నమోదు అయింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా ఎవరు ఊహించని విధంగా ఒక మహిళ నన్ను మోసం చేశారు.. దగా చేశారు అంటూ ఆళ్ల నానిపై కేసు పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు దీనిపై ఆళ్ల నాని ఎలా స్పందిస్తారు అన్న విషయాన్ని చూడాలి.













