టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం (టీడీపీ) పార్టీలో చేరారు. గుంటూరులోని తన నివాసం నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. వందలాది వాహనాల్లో కన్నా అనుచరులు నినాదాలు చేస్తూ ఆయన వెంట వచ్చారు. ముందుగా నిశ్చయించుకున్న ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 2:48 గంటలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో కన్నా తెలుగుదేశం పార్టీలో చేరారు. పసుపు కండువా కప్పి కన్నా లక్ష్మీ నారాయణను చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. కన్నాతో పాటు ఆయన అనుచరులు వేలాదిగా టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో కోట్ల విజయభాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు. కాపు సామాజీక వర్గంలో కీలక నేతగా ఉన్నారు. ఈ నెల 16న కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.













