అమరావతికి వరద పోటు..!! రాజధానిగా పనికిరాదా..??
ఆంధ్రప్రదేశ్ విడిపోయి పదేళ్లు దాటింది. పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరాన్ని నిర్మించుకోలేకపోయింది. ఇందుకు రాజకీయ కారణాలే కారణం. మొదటి ఐదేళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి తాత్కాలిక నిర్మాణాలు చేపట్టింది. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. దీంతో అమరావతి అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పుడ మళ్లీ టీడీపీ అదికారంలోకి రావడంతో అమరావతే రాజధాని అని స్పష్టం చేసింది. అయితే రాజధానిగా అమరావతి అంత సురక్షితం కాదని కొంతమంది ఆక్షేపిస్తున్నారు.
రాజధాని అమరావతికి ఆనుకుని ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలను వరద ముంచెత్తింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల ఈ రెండు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. అదే సమయంలో ఎగువన కురిసిన వర్షాల ధాటికి కృష్ణానదికి వరద పోటెత్తింది. బుడమేరు పొంగిపొర్లుతోంది. దీంతో అటు అమరావతి, ఇటు విజయవాడ పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో అమరావతి రాజధానిగా పనికిరాదని.. దానికి ఎప్పటికైనా ముప్పు పొంచి ఉందని సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు.
వాస్తవానికి అమరావతి రాజధానిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు సంకల్పం. ఇప్పుడు ఇంకా అక్కడ నిర్మాణాలే మొదలు కాలేదు. మాస్టర్ ప్లాన్ రెడీ అయింది కానీ అది ఇంకా పట్టాలెక్కలేదు. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అంతర్జాతీయ స్థాయి సంస్థలు పాలుపంచుకున్నాయి. ఎండవేడిమి, వర్షాలు, వరదలు, భూకంపాలు.. లాంటి వాటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే డిజైన్లను ఆమోదించారు. అవి ఇంకా కార్యరూపం దాల్చాల్సి ఉంది. నిర్మాణాలను వీటన్నిటికీ అనుగుణంగా నిర్మించాలని ముందే నిర్ణయించుకుంది ప్రభుత్వం.
అయినా వరద ముప్పు ఒక్క అమరావతికే కాదని.. దేశంలోని అనేక రాజధానులు ఇలాంటి విపత్తులను ఎదుర్కొంటూనే ఉన్నాయని మరికొందరు కౌంటర్స్ ఇస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఇటీవల వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ముంబై, చెన్నైలో కుండపోత వర్షాలకు ఎలా విలవిలలాడాయో మనకు తెలుసు. సుందరనగరంగా పేరొందిన బెంగళూరు కూడా కొద్దిపాటి వర్షానికే అతలాకుతలమవుతోంది. అంతవరకూ ఎందుకు.. మన హైదరాబాద్ లో వానొస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుందో రోజూ చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఇంకా పురుడే పోసుకోని అమరావతిపై అవాకులు, చెవాకులు పేలడం సరికాదని కొందరు సూచిస్తున్నారు. 30 సెం.మీ.లకు పైగా వర్షపాతం నమోదైనప్పుడు ఎలాంటి ప్రాంతాలైనా కొన్ని రోజులపాటు వరద నీటిలో చిక్కుకోవడం సహజమని చెప్తున్నారు.













