ఫ్లెక్సీలకెక్కిన నిరసన.. ఆర్థిక మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు..
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గనకు వ్యతిరేకంగా పలు ఫ్లెక్సీలు వెలిశాయి. సీపీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పట్టణ సమీపంలోని రుద్రాక్ష గుట్ట వద్ద పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో తీవ్రస్థాయిలో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీపీఐ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించడం రాష్ట్రమంతా సంచలనంగా మారింది. ఈ ఫ్లెక్సీలపై ‘అసెంబ్లీలో పిట్టకథలు చెప్పే బుుగ్గన.. రుద్రాక్ష గుట్ట బాధితులకు చెప్పేది కూడా పిట్టకథలేనా?’ అంటూ రాసుకొచ్చారు. ఫ్లెక్సీలపై సీపీఐ చేసిన నినాదంపై ప్రస్తుతం తారాస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. డోన్ పట్టణంలోని రుద్రాక్ష గుట్టలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండానే వారి ఇళ్లను దౌర్జన్యంగా కూల్చేసిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించండి! పేదలపై ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రప్రసాద్ చేస్తున్న దౌర్జన్యాన్ని నిరసించండి అంటూ సీపీఐ ఫ్లెక్సీలపైన రాసింది. మంత్రిగా ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసిన బుగ్గన తీరును గమనించాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఈ విషయం కాస్తా చర్చనీయాంశంగా మారడంతో మున్సిపాలటీ సిబ్బంది వాటిని తొలగించేందుకు అక్కడకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ నేతలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో పోలీసులు కూడా అక్కడకు తరలి వచ్చారు. దీంతో ఫ్లెక్సీల విషయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.













