బ్యాంకులు మరింత సహకరించాలి : ఆర్థిక మంత్రి బుగ్గన
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బ్యాంకులు మరింత సహాయ సహకారాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. కోవిడ్ ఉన్నప్పటికీ పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వైఎస్సార్ సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, అందరికీ ఇళ్లు లాంటి పథకాలకు మాత్రం బ్యాంకులు మరింత సహాయాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, రైతుల కోసం సీఎం జగన్ అనేక పథకాలు తెస్తున్నారని, వాటన్నింటికీ బ్యాంకులు అవసరమైన రుణాలు ఇవ్వాలన్నారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద సుమారు 50 లక్షల మందికి బీమాను కలిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనికి కూడా బ్యాంకులు సహకరించాలని ఆయన వివరించారు. స్వయం సహాయక సంఘాలకిచ్చే రుణాలపై వడ్డీ విషయంలో అన్ని బ్యాంకులు ఒకే విధమైన విధానాన్ని అవలంబించాలని బుగ్గన సూచించారు.













