Karedu: ముదురుతున్న కరేడు భూముల వివాదం.. ప్రభుత్వ మౌనమెందుకు..?

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు (Karedu) గ్రామంలో ఇండోసోల్ సోలార్ ప్రాజెక్ట్ (Indosol solar project) కోసం ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 8,000 ఎకరాలకు పైగా భూమిని సేకరించేందుకు రాష్ట్రంలోని టీడీపీ (TDP) నేతృత్వంలోని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, తాము భూములు ఇవ్వబోమని స్థానిక రైతులు, గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జీవనోపాధికి ఆధారమైన సారవంతమైన వ్యవసాయ భూములను కోల్పోవడం ద్వారా తమ జీవితాలు అంధకారంలోకి వెళ్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకునేలా స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం, గతంలో జరిగిన భూ కేటాయింపులు రద్దు చేయడం వంటి అంశాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
ఇండోసోల్ సోలార్ ప్రాజెక్ట్ కోసం గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) హయాంలో చేవూరు, రాపూరు మండలాల్లో 5,000 ఎకరాలకు పైగా భూమిని కేటాయించారు. ఇక్కడ ఇండోసోల్ కంపెనీ పనులు కూడా ప్రారంభించింది. అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ భూముల కేటాయింపును రద్దు చేసింది. బదులుగా కరేడు గ్రామంలో 8,234 ఎకరాలకు పైగా భూమిని ఇండోసోల్ కంపెనీకి కేటాయించేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయం స్థానిక రైతులను కలవరపరిచింది. కరేడు గ్రామంలో 19 రకాల పంటలు పండించే సారవంతమైన భూములున్నాయి. 30 అడుగుల లోతులోనే నీటి వనరులున్నాయి. అలాంటి భూములను సోలార్ ప్లాంట్ కోసం తీసుకోవడం రైతుల జీవనోపాధిని ధ్వంసం చేస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరేడు గ్రామస్థులు పది రోజులుగా తమ భూములను కాపాడుకునేందుకు ఉద్యమిస్తున్నారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై రోడ్డురోకోలు, ధర్నాలు, ఊరేగింపులు నిర్వహించారు. సుమారు వెయ్యి మంది మహిళలు, రైతులు, గిరిజనులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. స్థానిక నాయకులు, సీపీఎం, భారత చైతన్య యువజన పార్టీ (BCY) నాయకులు ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
చేవూరు, రాపూరు మండలాల్లో ఇప్పటికే కేటాయించిన భూములను రద్దు చేసి, కరేడు గ్రామంలో సారవంతమైన భూములను ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక లాభాలు ఉన్నాయని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి మెరుగు నాగార్జున ఈ భూ సేకరణను “బలవంతపు, అన్యాయమైన” చర్యగా అభివర్ణించారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఇండోసోల్ కంపెనీని వైసీపీ నాయకులతో అనుబంధం ఉందని టీడీపీ నాయకులు ఆరోపించగా, ఇప్పుడు అదే కంపెనీకి భూములు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారితీసింది.
కరేడు గ్రామంలో భూ సేకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. “ప్రాణాలు పోయినా భూములు ఇవ్వబోము” అని రైతులు స్పష్టం చేశారు. పోలీసులు కొందరు ఆందోళనకారులను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపణలు ఉన్నాయి. కందుకూరు సబ్-కలెక్టర్ శ్రీపూజ ఆందోళన స్థలానికి చేరుకుని, భూ సేకరణ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. అయినా, ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ లేకపోవడంతో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకత పాటించాలని, రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలని విపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.