ఎన్నికల నేపథ్యంలో వైరల్ అయిన ఫేక్ న్యూస్.. అసలు విషయం బయటపెట్టిన పోలీసులు..
ఎన్నికల సమయంలో పలు ప్రాంతాలలో తీవ్రమైన అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఎందరో గాయపడ్డారు. సోషల్ మీడియా వేదికగా పార్టీలు తమ వైపు నుంచి గాయపడిన వారి గురించి సమాచారాన్ని అందించారు. ఇక ఆ పార్టీ సానుభూతిపరులు ఈ పోస్టులను వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులు ఎలక్షన్ రోజు జరిగిన దాడి అంటూ వైరల్ అయిన వార్తపై క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు వైరల్ అవుతున్న గొడవల వార్తలలో ఎన్ని నిజాలు.. ఎన్ని అబద్ధాలు.. ఉన్నాయో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే.. ఎన్నికల రోజు విశాఖపట్నంలోని అక్కిరెడ్డిపాలెంలో జరిగిన ఒక గొడవ సోషల్ మీడియాలో వైరల్ అయింది.. వైసీపీకి ఓటు వేయలేదు అనే కక్షతో ఓ కుటుంబం పై దాడి జరిగిందని.. అందులో కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయాలపాలయ్యారని ఓ వార్త సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలతో పాటు ప్రచారం చేయబడింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అయితే ఇది పొలిటికల్ అటాక్ అని ఆరోపించడంతో నారా లోకేష్ కూడా దీనిపై స్పందించారు. తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుంచి నారా లోకేష్ ఈ విషయంపై పోస్ట్ పెట్టారు. దీనికి స్పందించిన టీడీపీ సానుభూతిపరులు.. ముందు వెనుక ఆలోచించకుండా ఈ విషయాన్ని హైలెట్ చేయడమే కాకుండా వైసీపీ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు.
అయితే ఇప్పుడు విశాఖ పోలీసులు గొడవ కు సంబంధించిన అసలు నిజాన్ని బయటపెట్టారు. నిజానికి ఇది పొలిటికల్ దాడి కాదని.. కేవలం వ్యక్తిగత తగాదాల వల్ల ఇరుగుపొరుగు వారు ఒకరిపై ఒకరు చేసుకున్న దాడి అని స్పష్టం చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో వస్తున్న ఫేక్ పోస్టులను నమ్మొద్దు అని కూడా చెప్పారు. అంతవరకు బాగుంది అయితే ఈ విషయం వైరల్ కావడంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం.. లోకేష్ ఆలోచించకుండా తమ గురించి పోస్ట్ పెట్టడాన్ని హైలైట్ చేస్తూ.. అతని ఘాటుగా విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. మరి ఇప్పుడు ఈ పోస్ట్ పై ఎంత రచ్చ జరుగుతుందో చూడాలి.













