ఎస్ఆర్ఎం ప్రొఫెసర్ కు అరుదైన గుర్తింపు …
అమరావతి ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ ఇమ్రాన్ పాంచకు ప్రపంచ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇటీవల జరిపిన ప్రత్యేక సర్వేలో ప్రపంచ టాప్ 2 శాతం ఉత్తమ శాస్త్రవేత్తల జాబితాలో డాక్టర్ ఇమ్రాన్‌కు చోటు దక్కినట్లు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. బయోటెక్నాలజీకి సంబంధించిన 22 విభాగాల్లో పరిశోధనలపరంగా ప్రపంచ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 1074 మంది శాస్త్రవేత్తలను గుర్తించిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అందులో డాక్టర్ ఇమ్రాన్ పాంచను ఒకరిగా గుర్తించినట్టు పేర్కొంది.
భారత్ నుంచి బయోటెక్నాలజీ విభాగంలో మొత్తం 77 మంది శాస్త్రవేత్తలు ఈ గౌరవాన్ని దక్కించుకోగా అందులో డాక్టర్ ఇమ్రాన్ పాంచ ఉండడం ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి గర్వకారణమని యాజమాన్యం పేర్కొంది. రీసెర్చ్ వర్క్, పబ్లికేషన్స్, సైటేషన్స్, రీసెంట్ పబ్లికేషన్స్ విభాగాల్లో డాక్టర్ ఇమ్రాన్ పాంచ ప్రచురించిన పేపర్లను పరిగణనలోకి తీసుకుని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో ఆయన పేరు పొందుపర్చినట్లు ప్రొఫెసర్ వైఎస్ ఛాన్సలర్ ఆచార్య డీ.నారాయణరావు వివరించారు. యూనివర్సిటీలో జరిగిన అభినందన కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణన్ కమెండేషన్ సర్టిఫికేట్‌ను ఇమ్రాన్ పాంచకు అందజేసి అభినందనలు తెలిపారు.













