బీజేపీలోకి కేంద్ర మాజీ మంత్రి సాయిపత్రాప్!
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ముందు మొదలైన నేతల జంపింగ్‌లు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, టీడీపీకి చెందిన పలువురు నేతలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో బలోపేతం కావాలని బీజేపీ కూడా ఆపరేషన్ షురూ చేసింది. అధికార, విపక్ష పార్టీలో ఉండే అసంతృప్తులు, మాజీ మంత్రులను బీజేపీలోకి లాక్కునే పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు. తాజాగా కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే రాజంపేటలో జరిగే బహిరంగ సభలో సాయిప్రతాప్ కాషాయం కండువా కప్పుకోనున్నారు. సునీల్ ధియోదర్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో సాయిప్రతాప్, అతని కుటుంబ సభ్యులు బీజేపీలో చేరనున్నారు. సాయి పార్టీలోకి వస్తే కడప జిల్లాలో బీజేపీ బలోపేతం అవుతుందని కడప కమలనాథులు భావిస్తున్నారు. అయితే ఈ చేరికపై ఇంతవరకూ సాయిప్రతాప్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.













