రాష్ట్రం కోసం వారిద్దరూ కలిసి పోటీ
పరిపాలన మొదటిరోజు నుంచే సీఎం జగన్ అవినీతికి పాల్పడ్డారని, వైసీపీలో ఉన్నానంటే తనకే అసహ్యంగా ఉందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడు అనుకోలేదని జగన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఈసారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్ప, ఆంధ్రప్రదేశ్‌ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్ప మరో నేత కాపాడలేరు అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ నిజాయతీని ప్రశ్నించలేం. రాష్ట్రం కోసం వారిద్దరూ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నా. నేను వైసీపీలోనే ఉన్నా. వారేమీ నన్ను తీసేయలేదు అన్నారు. వచ్చే ఎన్నిల్లో గుర్తింపు పొందిన పార్టీ తరపునే నేను పోటీ చేస్తానన్నారు. జనవరి 3 నుంచి మాజీ వివేకా హత్య కేసు మలుపు తిరగనుంది. ఆ కేసులో ఎర్ర గంగిరెడ్డే కీలక వ్యక్తి అని సీబీఐ గుర్తించింది. జనవరి 3న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఉన్నాయి. సుప్రీం తీర్పు తర్వాత ఈ కేసు విషయంలో జిల్లాలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది మెడకు ఉచ్చు బిగిసే అవకాశముంది. వివేకా హత్య కేసులో ఒంటరిగా పోరాడుతున్న ఆమె కుమార్తె సునీత ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు అని అన్నారు.













