రెవెన్యూ సమస్యల పరిష్కారంకోసం గ్రీవెన్స్ సెల్ల ఏర్పాటు
రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి రెవెన్యూ శాఖను మరింత చేరువ చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బందికి శిక్షణకై ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేసేందుకు కూడా అవసరమైన చర్యలు తీసుకుం టున్నామని, అలాగే సమస్యల పరిష్కారంకోసం సెప్టెంబరు మొదటి వారంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రీవెన్సు సెల్ ను కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా రెవిన్యూ శాఖలోని మంచి అనుభవం గల అధికారులు తగు సూచనలు, సలహాలు అందజేయాలని ఆయన కోరారు. రెవెన్యూ ఉద్యోగుల పని విధానంతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే విషయాన్ని రెవిన్యూ ఉద్యోగులు అంతా గుర్తించాలన్నారు.
రెవెన్యూ అంశాలకు సంబందించి ప్రజలు ఎక్కువగా సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. అసలు ఎటు వంటి అంశాలు, సందర్బాల్లో ప్రజలు సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందనే విషయాన్ని రెవిన్యూ అధికారులు ముందుగానే గుర్తించి, వాటి శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో అమలు చేయబడుచున్న డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరనైజేషన్ ప్రోగ్రాం, రీసర్వే, రీసర్వే గ్రామాల్లోని ఫైనల్ రికార్డుల స్థితిగతులు ఆయన సమీక్షలో తెలుసుకున్నారు. న్యూ సిటిజన్ సర్వీసెస్ అమలు, రెవిన్యూ అధికారులకు అందజేసే సర్వే శిక్షణ, కుల దృవీకరణ పత్రాల సత్వర జారీకై అనుసరిస్తున్న విధి విధానాలతో పాటు, ప్రభుత్వంలో పెండిరగ్ లో ఉన్న పలు ముఖ్యమైన ఫైల్స్ స్థితి గతులు తదితర అంశాలపై సీసీఎల్ఏ జి సాయిప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.
క్షేత్ర స్థాయిలో పనిచేసే పాత అధికారులతోనే ఈ సదస్సులను నిర్వహిస్తే సరైన ఫలితాలు రావని, ప్రజలకు న్యాయం జరగదని ప్రభుత్వం భావించి, ఉద్యోగల బదిలీల ప్రక్రియ పూర్తి అయిన తరువాత కొత్త అధికారులతో ఈ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈ సదస్సుల్లో భాగంగా మొదటి 45 రోజుల పాటు భూ వివాదాలు, రీ-సర్వేలో జరిగిన తప్పిదాలకు సంబందించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, తదుపరి 45 రోజుల్లో అర్జీలపై తగు చర్యలు తీసుకుంటూ రెవిన్యూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ రెవిన్యూ సదస్సులను పకడ్బందీగా, పటిష్టంగా నిర్వహించేందుకు ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారిని నోడల్ అధికారిగా నియమించడంతో పాటు ఆయా జిల్లాల్లోని మంత్రులు, అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారన్నారు.
గత ప్రభుత్వ హయాంలో అసైన్డు భూముల విషయంలో ఎన్నో అవకతవకలు, మోసపూరితమైన రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయన్నారు.
ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ ఆధారంగా మోసపూరితమైన ఆధారాలతో కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించామన్నారు. గతంలో ఈ విధంగా జరిగిన మోసపూరిత రిజస్ట్రేషన్లపై పూర్తి స్థాయిలో అధ్యయనం, విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకు ఎటువంటి అన్యాయం జరుగకుండా, వారికి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ భూముల రిజిస్ట్రేషన్లను మూడు నెలలపాటు నిలుపుదల చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిషేదిత భూముల చట్టంలోని 22(ఎ) జాబితాను కూడా పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేయడం, ఎన్నో అవకవతకలకు పాల్పడ్డారన్నారు. ఒక్కొక్క కేసును అధ్యయనం చేసి బాధితులకు న్యాయం చేసే విధంగా వాటన్నింటినీ క్రమబద్ద్దీకరించాలనే లక్ష్యంతోనే మూడు మాసాలపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. గతంలో ఇనాం భూములు, ఎస్టేట్ భూములు, తిరుపతిలోని మఠం భూములు కూడా రకరకాలుగా కబ్జాలకు గురి అయ్యాయని, రికార్డులు కూడా తారుమారు అయ్యాయన్నారు. వీటన్నింటి పై పూర్తి స్థాయిలో అధ్యయం చేసి బాధితులకు న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అదే విధంగా అగ్రిగోల్డు భూముల వివాదం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో ఆ భూముల రిజిస్ట్రేషన్లు ఎట్టి పరిస్థితిలోనూ జరగడానికి వీల్లేదన్నారు. అయితే అక్కడున్న అధికారుల తప్పిదాల వల్ల అగ్రిగోల్డు భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయని, ఈ విషయంలో న్యాయస్థానమే తగు నిర్ణయం తీసుకుంటుందని మంత్రి అనగాని తెలిపారు.













