ఏపీ దేవాదాయ శాఖ అర్చకులకు, ఉద్యోగులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ అర్చకులకు, ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. సచివాలయంలో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు పది వేల లోపు ఉన్న అర్చకులకు 10 వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అర్చకులకు న్యాయం చేయడం కోసం ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,146 మంది అర్చకులకు జీతాలు పెరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. దేవాలయాల్లో సాంకేతిక సిబ్బంది కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
దేవాలయాల పరిరక్షణ కోసం సెక్షన్ 83లో మార్పులు తెస్తున్నామన్నారు. వివాదాస్పదమైన గ్రూప్-3 ఈఓల ప్రమోషన్ల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పొన్నూరు భావన్నారాయణ స్వామి దేవాలయ భూములను ఆటో నగర్‌కు కేటాయించాలని ప్రతిపాదన వచ్చిందని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉండే కేటగిరి-1 దేవస్థానాలలో పనిచేసే అర్చకులకు గౌరవ వేతనం రూ.15,625, కేటగిరి-2లో అర్చకులకు రూ.10 వేలు దేవాదాయ శాఖ చెల్లిస్తుంది. అలాగే అర్చకులకు 100 శాతం వైద్య ఖర్చులు కూడా భరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.













