గీతం కబ్జా.. తేదేపా ఇరుక్కుందా?
తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పనంత గొప్ప రాజకీయం ఇప్పుడెవరూ చేయడం లేదనేది వాస్తవమే కానీ.. ఓ వైపు తమవార్ని కాపాడుతూనే మరోవైపు తాము అధర్మం చేయడం లేదని జనాన్ని నమ్మించడం అయినా చేయాలి కదా.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం పార్టీ చాకచక్యంగా వ్యవహరరించలేకపోతోందా? అంటే చాలా వరకూ అవుననే చెప్పాలి.
విశాఖపట్టణం వంటి మెట్రో స్థాయి నగరంలో ఏర్పాటైన గీతం యూనివర్సిటీ ఎంతో కాలంగా అక్కడ విద్యా రంగంలో ఎనలేని సేవలు అందిస్తోందనేది సుస్పష్టం. ఆ వర్సిటీ లో చదువుకున్న ఎందరో మంచి కెరీర్ను అందుకున్నారనేది కూడా వాస్తవమే. ప్రస్తుతం ఆ వర్సిటీకి అగ్రగామి విశ్వవిద్యాలయంగా గుర్తింపు ఉంది. ఇవన్నీ నిజమే అయినా.. అంత మాత్రాన అవన్నీ చట్ల ఉల్లంఘణకు అర్హతలు కావు కదా? ఒక విద్యా సంస్థ ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడిందని తేలిన తర్వాత కూడా బాధ్యత కలిగిన రాజకీయ నేతలు ఆ విద్యాసంస్థకు బాసటగా నిలవడం ఎంత వరకూ సబబు? ప్రభుత్వ లెక్కల ప్రకారం 41 ఎకరాల స్థలం అంటే దాని విలువ దాదాపు రూ.800 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.
అంత విలువైన భూములను తమ స్వాధీనం లోకి తీసుకున్న సంస్థ ఎవరిదైనా సరే… దానిపై సమగ్ర విచారణ జరపాలని నిజంగా చట్ట వ్యతిరేకమైతే చర్యలు తీసుకోవాలని ఒక సీనియర్ పార్టీ నాయకుడిగా చంద్రబాబు అండ్ కో ప్రకటించి ఉంటే హుందాగా ఉండేది. అలా కాకుండా ఇది కక్షసాధింపు చర్య అంటూ పదేపదే విమర్శించడం వల్ల ప్రజల్లో ఆ పార్టీ కబ్జా దారులకు వంత పాడుతున్నదనే భావన ఏర్పడింది. ఇక తేదేపా నేత వర్లరామయ్య అయితే మరో అడుగు ముందుకేసి.. అది ఆక్రమణే అయినప్పటికీ క్రమబద్ధీకరించుకునే అవకాశం ఇచ్చి ఉండొచ్చు కదా అంటూ వ్యాఖ్యానించి మరింతగా ప్రజల్లో తమ నిర్వాకాన్ని చర్చనీయాంశం చేశారు.
నిజానికి తేదేపా నేతలు గీతం వర్సిటీకి బేషరతుగా బాసటగా నిలవడం వల్ల ఆ పార్టీకి నష్టదాయకమే కాకుండా వర్సిటీకి కూడా ఏ మాత్రం ఉపయోగం లేదు. తెలుగుదేశః నేతల ఓవర్ యాక్షన్ పుణ్యమాని వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోయి గీతం వర్సిటీ కి వ్యతిరేకంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇందులో వాస్తవాలెన్ని అబద్ధాలెన్ని అనేవి అలా ఉంచితే.. ఇంత పెద్ద యెత్తున వ్యతిరేక ప్రచారం జరగడం ఎంతో భవిష్యత్తు ఉన్న సంస్థలకు మంచిది కాదనేది నిర్వివాదం.
నిజానికి పెద్ద పెద్ద సంస్థలకు ప్రభుత్వంతో ఇలాంటి వివాదాలు మరీ విడ్డూరమేమీ కాదు. సదరు వివాదాలు ఎలాగూ న్యాయస్థానం పరిధిలోకి వెళతాయి. అంతిమంగా ఎవరివైపు న్యాయం ఉంటే వాళ్లు గెలుస్తారు. ఇలా జరగడం వల్ల విద్యా సంస్థ ప్రతిష్టకు పెద్దగా నష్టం వాటిల్లే అవకాశఃం లేదు. అయితే ఎప్పుడైతే ఇవి రాజకీయ రచ్చలోకి లాగబడతాయో.. ఇక వాటిపై ఉన్నవీ లేనివీ ప్రచారంలోకి వస్తాయి. తద్వారా ఎన్నో ఏళ్లపాటు కష్టపడి సాధించుకున్న పేరు ప్రతిష్టలు మంటగలుస్తాయి. ఈ వాస్తవాన్ని అటు తేదేపా ఇటు వర్సిటీ నిర్వాహకులు గుర్తిస్తే మంచిది.













