ఆంధ్రాలో మొదలైన ఎన్నికల జోరు.. ఏపీలో సాగుతున్న ఎన్నికల అధికారుల బృందం పర్యటన
తెలంగాణలో ఎన్నికల పోరు పరిసమాప్తమయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి మొదలు కాబోతోంది .ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం జరగబోయే ఎన్నికల ఏర్పాట్ల దిశగా అడుగులు వేస్తోంది .అప్పుడే దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కసరత్తు కూడా మొదలు పెట్టేసింది. 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలోనే లోక్ సభకు కూడా ఎన్నికలు జరిగాయి. దీంతో వచ్చే ఏడాది జూన్ 10 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి. అందుకే ఎన్నికల సంఘం అధికారుల బృందం ఇప్పుడు ఏపీలో పర్యటనకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితేష్ వ్యాస్.. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హిర్దేశ్ కుమార్ తో పాటుగా మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్న బృందం విజయవాడకు చేరుకుంది. ఈరోజు నుంచి రెండు రోజుల వరకు ఈ బృందం ..2024 ఓటర్ల జాబితా రూపకల్పనతో పాటు మిగిలిన ఎన్నికల సన్నాహాల గురించి సమీక్ష జరుపుతారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాలకు చెందిన కలెక్టర్లకు, ఎస్పీలకు సమావేశాలు జరిపి ఎన్నికల ఏర్పాట్లపై చర్చించబోతున్నారు.
ఈ రోజున 18 జిల్లాల కలెక్టర్లు ,ఎస్పీలతో ఎన్నికల సంఘం అధికారులు సమావేశం అవుతున్నారు. డిసెంబర్ 23న మరొక 8 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం జరుపుతారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఓటర్ల వివరాలతో పాటు పోలింగ్ ఏర్పాట్లు ఎలా జరుగుతాయి.. సమస్యాత్మకమైన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా.. పోలీసు సిబ్బంది తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చించడం జరుగుతుంది. ఇక 23 న మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం ఎన్నికలకు సంబంధించి అధికారులు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ,ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్ల గురించి దిశానిర్దేశం చేస్తారు.
ఎన్నికలకు ప్రధానమైనటువంటి ఓటర్ జాబితా విషయంపై ఈ సమావేశంలో అధికారులు పలు ముఖ్యమైన సూచనలు చేసే అవకాశం ఉంది అని టాక్. ఇప్పటివరకు ఓటర్ల జాబితాలో జరుగుతున్నటువంటి అవకతవకలు ,నకిలీ ఓట్లు ,డబల్ ఎంట్రీ ఓట్లపై.. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనాకు ఫిర్యాదు చేశాయి. ఇప్పుడు వీటి గురించి కూడా అధికార బృందం చర్చించబోతోంది.













