తిరుపతి బైపోల్ సందడి షురూ..! ఎవరికెంత సీన్ ఉంది?
తిరుపతి ఉప ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ రానుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. ఈ నెల 30 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 3 వారకూ నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువుంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరుగుతుంది. మే 2న ఫలితాలు వెల్లడవుతాయి. ఈ ఉపఎన్నికలో సత్తా చాటేందుకు అన్ని పార్టీ వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి.
తిరుపతి అధికార వైసీపీకి సిట్టింగ్ స్థానం. బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో కన్నుమూయడంతో ఈ ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. సీఎం జగన్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ గురుమూర్తి ఇక్కడ ఆ పార్టీ తరపున బరిలో దిగుతున్నారు. గురుమూర్తికి రాజకీయ అనుభవం లేదు. అయితే గురుమూర్తి గెలుపుకోసం అస్త్రశస్త్రాలన్నింటనీ సిద్ధం చేశారు సీఎం జగన్. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంత్రులను బాధ్యులుగా నియమించారు. ఒక ఎమ్మెల్యేను సహాయకుడిగా ఉండమన్నారు. వీళ్లందరినీ సమన్వయం చేసే బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఇక్కడ గెలవడం ఖాయమని భావిస్తున్న వైసీపీ.. కేవలం మెజారిటీపైనే దృష్టి పెట్టింది. ఇక్కడ కనీసం 4లక్షలు మెజారిటీ సాధించాలనేది ఆ పార్టీ ప్లాన్. తిరుపతి మెజారిటీపై దేశం మొత్తం చర్చ జరిగిలా ఉండాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. కాబట్టి ఇక్కడ గెలవడం సమస్యే కాదనుకుంటోంది వైసీపీ. ఇప్పుడు దాని టార్గెట్ అంతా మెజారిటీపైనే.
ఇక ప్రతిపక్ష టీడీపీ ఇక్కడ అందరికంటే ముందే అభ్యర్థిని ప్రకటించింది. 2019ఎన్నకల్లో పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మినే ఈసారి కూడా బరిలోకి దించుతోంది. క్షేత్రస్థాయి వరకూ బలమైన కేడర్ ఉండడం టీడీపీకి కలిసొచ్చే అంశం. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. నియోజకవర్గాలకు కీలకమైన వ్యక్తులను బాధ్యులుగా నియమించింది. ఎలాగైనా గెలవాలని.. లేకుంటే పార్టీ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని అధినేత చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. పోరాడితే కచ్చితంగా గెలుస్తామని స్పష్టం చేశారు. అలసత్వం వహించే నేతలపై చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు.
బీజేపీ – జనసేన మధ్య పొత్తు నడుస్తోంది. అవగాహనలో భాగంగా ఈ స్థానం నుంచి బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధమైంది. అయితే ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. వ్యూహాత్మకంగానే తాము అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదని చెప్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ పనైపోయిందని భావిస్తున్న బీజేపీ.. కనీసం రెండో స్థానం సాధించాలనే పట్టుదలతో పనిచేస్తోంది. అయితే క్షేత్రస్థాయి నిర్మాణం లేకపోవడం ఆ పార్టీకి మైనస్. జనసేన కేడర్ ఓట్లపైనే బీజేపీ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయితే ఆ ఓట్లు బీజేపీకి మళ్లుతాయా.. లేదా.. అనేదానిపై అనుమానాలున్నాయి.
కాంగ్రెస్ తరపున చింతామోహన్ పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. గతంలో పలుమార్లు ఇక్కడి నుంచి పోటి విజయం సాధించారు చింతామోహన్. అయితే కాంగ్రెస్ కేడర్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం అంతంతమాత్రమేనని చెప్పొచ్చు.













