కూటమికి తప్పిన గాజు గ్లాసు గండం..! జనసేనకు బిగ్ రిలీఫ్..!!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేన గుర్తింపు పొందిన పార్టీ కాకపోవడంతో ఆ పార్టీకి చెందిన గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది ఎన్నికల సంఘం. దీంతో జనసేన పోటీ చేసే స్థానాలు మినహా మిగిలిన చోట్ల గాజు గ్లాసును ఇతరులకు కేటాయించే వీలు కలుగుతుంది. సోమవారం ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు గుర్తులు కేటాయించింది ఎన్నికల సంఘం. ఇందులో పలువురు ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు గుర్తు లభించింది. దీంతో జనసేన సహా కూటమి పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.
గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించడం ద్వారా ఓటర్లు కన్ఫ్యూజ్ చెందే అవకాశం ఉందని.. కాబట్టి ఇతరులకు కేటాయించవద్దని ఈసీకి కూటమి పార్టీలు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మంగళవారం జనసేన, టీడీపీలు హైకోర్టులో గాజుగ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించకుండా ఆదేశాలివ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ఈసీ వివరణ కోరింది హైకోర్టు. అయితే ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్నందున అలా గుర్తు కేటాయించకుండా ఉండలేమని ఈసీ వివరించింది. అయితే తాము బరిలో ఉన్న 13 పార్లమెంటు స్థానాల్లోనైనా గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించకుండా చూడాలని కోరాయి.
పిటిషన్లపై విచారణ జరిపిన అనంతరం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జనసేన పోటీ చేస్తున్న 13 పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో ఇతరులెవరికీ గాజు గ్లాసు గుర్తును కేటాయించవద్దని ఈసీని ఆదేశించింది. విజయనగరం, అరకు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, రాజంపేట లోక్ సభ స్థానాల పరిధిలో జనసేన పోటీ చేస్తోంది. దీంతో ఈ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించే వీలు లేకుండా పోయింది. దీన్ని జనసేనకే ఈసీ ఫ్రీజ్ చేసింది. గాజు గ్లాసును ఇప్పటికే దక్కించుకున్న ఇతరులు ఈ సింబల్ ను కోల్పోవాల్సి వచ్చింది.
మచిలీపట్నం, కాకినాడ పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది. అలాగే ఈ రెండు సీట్ల పరిధిలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించే వీలు లేకుండా పోయింది. గుర్తు కేటాయింపుల్లో మార్పులు చేయాలని ఆర్వోలకు సీఈఓ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఇది జనసేనకు బిగ్ రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. దీంతో కూటమి పార్టీలు ఊపిరి పీల్చుకున్నాయి.













