ఏపీ ఎన్నికల నగారా..
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కేంద్రం ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను శనివారం విడుదల చేశారు. మూడు దశలలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఏపీలో ఏప్రిల్18న నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు వెల్లడించారు. మే 13న పోలింగ్ నిర్వహించి, జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సిఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ఎన్నికల షెడ్యూల్ ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ తేదీ -ఏప్రిల్ 18
నామినేషన్లు ప్రారంభం-ఏప్రిల్ 18
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ -ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన -ఏప్రిల్ 26
నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ – ఏప్రిల్ 29
పోలింగ్ – మే 13
ఓట్ల లెక్కింపు -జూన్ 4
ఏపీ సరిహద్దుల్లో చెక్ పోస్టులు
ఏపీ సరిహద్దుల్లోని పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు సిఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా భారీగా బలగాలను సైతం మోహరిస్తున్నారు. ఈ ఎన్నికలు అధికార వైసీపీ, విపక్ష కూటమి మధ్య ఈఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో.. భారీగా ప్రలోభపర్వం చోటు చేసుకోనుంది. ఇటీవలే ఓటర్ల నమోదు విషయంలోనూ పలు ఆరోపణలు చోటుచేసుకున్నాయి .దీంతో రాష్ట్రంలో ఎన్నికలపై ఈసీ నిఘా పెట్టింది.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం ఎలాంటి కొత్త పథకాలు, ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు ఇచ్చే అవకాశం ఉండదు.
ఇకపోతే ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉంది. వైనాట్ 175 లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లబోతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. వైసీపీ అధికారంలోకి వస్తోందా? కూటమి అధికారంలోకి వస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మెజారిటీ ఫిగర్ 88ని దాటాల్సి ఉంది.













