మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ధర్నా చేశారనే అభియోగాలపై నమోదైన కేసులో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారులకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది జూన్ 28న మోహన్ బాబు, తన కుమారులతో కలిసి తిరుపతి కోర్టులో విచారణకు హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబరు 30కి తేదీకి వాయిదా వేసింది. దీనిపై మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసుకు సంబంధించిన తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను 8 వారాలపాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
2019 మార్చి 22వ తేదీన అప్పటి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని మోహన్ బాబు కుటుంబం తిరుపతి`మదనపల్లె జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. అయితే అప్పటికే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో కోడ్ ఉల్లంఘన కింద మోహన్ బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌పై కేసు నమోదైంది. రోడ్డుపైకి వచ్చిన వాహనదారులకు ఇబ్బంది కలిగించారని, ధర్నాకు పోలీసుల అనుమతి తీసుకోలేదని వీరిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.













