ముఖ్యమంత్రి జగన్ హయాంలో పిల్లల చదువుకు ఆధునిక బాటలు
ఎపిలో విద్యారంగంలో ఆధునిక ఆలోచనలు, నూతన పద్ధతులను ప్రవేశపెట్టడంతోపాటు పిల్లలను సాంకేతికంగా కూడా బలంగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. అందులో భాగంగా ‘మన బడి నాడు`నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలను మెరుగు పరుస్తూనే, మరోవైపు ఆధునిక విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. విద్యా విధానంలో సమూల మార్పులు తెస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో 2022లో విద్యా రంగం మరో ముందడుగు వేసింది. చిన్నారులకు పునాది స్థాయి నుంచే అభ్యాసన సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు సాంకేతికతను, డిజిటల్ సాధనాలను సమర్థంగా వినియోగించుకొనేందుకు ప్రభుత్వం డిజిటల్ విద్యా విధానానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్ది వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకొనేలా చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలో శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్ల నుంచి ఉన్నత పాఠశాలల వరకు అధునాతన పరికరాలను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. స్మార్ట్ టీవీలు, వాల్టాప్ కంప్యూటర్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్‌పీ), ప్రొజెక్టర్ బేస్డ్ డీసీఆర్లను నెలకొల్పుతోంది. 50 వేలకు పైగా శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు, హైస్కూల్, హైస్కూల్‌ప్లస్ స్కూళ్లలో ఈ డిజిటల్ పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. తరగతి గదులను డిజిటలీకరణ చేస్తున్నారు. విద్యార్థులను అత్యున్నత సామర్థ్యాలతో తీర్చిదిద్దేందుకు సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాదిలో 1,000 స్కూళ్లకు సీబీఎస్ఈ గుర్తింపు కూడా వచ్చింది. మిగతా స్కూళ్లకూ గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టారు. డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయించి ఆధునిక ఈకంటెంట్ ద్వారా బోధన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10 వ తరగతి వరకు దాదాపు 32 లక్షల మంది విద్యార్థులకు బైజూస్ సంస్థ ఈ కంటెంట్‌ను కూడా ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్లలో బైజూస్ యాప్ ద్వారా ఈ కంటెంట్‌ను డౌన్లోడ్ చేయించింది. సీబీఎస్ఈ విధానం, డిజిటల్ విద్యలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 5.18 లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు, ఆ తరగతి టీచర్లకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబులను ప్రభుత్వం ఉచితంగా అందించి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను జగన్ ప్రభుత్వం తీసుకువచ్చింది.













