ED – Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. రంగంలోకి దిగిన ఈడీ!

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాం వ్యవహారం ప్రకంపనలు కలిగిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఇన్నాళ్లూ ఈ కేసును విచారిస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టడంతో కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ స్కామ్‌లో 3,500 కోట్ల రూపాయల వరకు మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన ఈ కుంభకోణంలో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. సిట్ విచారణ ఇప్పటికే దాదాపు కొలిక్కి వచ్చింది. ఇప్పుడు మనీలాండరింగ్ కు సంబంధించి వివరాలు రాబట్టేందుకు ఈడీ కూడా జోక్యం చేసుకోవడంతో కేసు పరిధి పెరుగుతుందని భావిస్తున్నారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసు మొదటి నుంచి తీవ్ర చర్చనీయాంశంగా ఉంది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ విభాగం ద్వారా లైసెన్సులు, కాంట్రాక్టులు అక్రమంగా కేటాయించడం, కిక్ బ్యాక్ చెల్లింపులు జరిగాయని సిట్ తేల్చింది. ముఖ్య నిందితుడు రాజ్ కెసిరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐటీ సలహాదారుగా పనిచేశారు. అతను లిక్కర్ పాలసీని రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడని, దీని ద్వారా పార్టీ నిధులు, వ్యక్తిగత ప్రయోజనాలకు డబ్బులు మళ్లించాడని ఆరోపణలు ఉన్నాయి. రాజ్ కాసిరెడ్డిని సిట్ ఏప్రిల్ లో అరెస్ట్ చేసింది. అతను జైలులో ఉండగా, ఈడీ అధికారులు అతన్ని విచారించారు. ఈ విచారణలో అతను లిక్కర్ కంపెనీలతో లింకులు, లంచాలు గురించి సమాచారం ఇచ్చాడని సమాచారం.
సిట్ విచారణలో 16 లిక్కర్ కంపెనీలు 1,677 కోట్ల రూపాయలు లంచాలుగా చెల్లించాయని తేలింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ABSBCL) ద్వారా రా మెటీరియల్ కొనుగోళ్లు, బ్రాండ్ ప్రమోషన్ పేరుతో డబ్బులు డైవర్ట్ చేశారు. నగదు రూపంలో లంచాలు తీసుకున్నారని.. ఇవి షెల్ కంపెనీలు, బీనామీల ద్వారా మళ్లించబడ్డాయని ఆరోపణలున్నాయి. ఈడీ ఈ అంశాలపై దృష్టి పెట్టింది. హవాలా మార్గాలు, ఫేక్ ఇన్‌వాయిసులు ఉపయోగించి మనీ లాండరింగ్ జరిగిందని అనుమానిస్తోంది. మే నెలలో ఈడీ ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECR) నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద కేసు నమోదైంది. సిట్ దర్యాప్తును ఆధారంగా చేసుకుని, మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటకలో మొత్తం 20 ప్రాంతాల్లో ఈడీ ఇవాళ సోదాలు చేపట్టింది. సోదాల్లో జ్యువెలరీ కంపెనీలు, ప్యాకేజింగ్ యూనిట్లు, బాటిలింగ్ కంపెనీలు, ఫ్రూట్స్ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఫేక్ బిల్లులు, ఇన్‌ఫ్లేటెడ్ ఇన్‌వాయిసుల ద్వారా కిక్‌బ్యాకులు చెల్లించాయని ఈడీ అనుమానం. పలు కంపెనీలకు నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిపించారు. హైదరాబాద్‌లో మనీ లాండరింగ్ మధ్యవర్తులపై సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇది కేసును మరింత బలోపేతం చేస్తుందని ఈడీ అధికారులు చెప్పారు.
సోదాలు జరిగిన కొన్ని ముఖ్య కంపెనీల్లో ఆరేటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ జ్యూవెలర్స్ ఎక్స్‌ఇంప్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్.ఆర్.ఉదయోగ్ ఎల్‌ఎల్‌పీ, ది ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (చెన్నై), వెంకటేశ్వర ప్యాకేజింగ్, సువర్ణ దుర్గ బాటిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, రావుసాహెబ్ బూరుగు మహాదేవ్ జ్యూవెలర్స్, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, మోహన్ లాల్ జ్యూవెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (చెన్నై) ఉన్నాయి. ఈ కంపెనీలు లిక్కర్ సరఫరాలో మధ్యవర్తులుగా పనిచేశాయని, ఇవి షెల్ కంపెనీలుగా పనిచేసి డబ్బులు మళ్లించాయని ఈడీ అనుమానిస్తోంది. ఇటీవల సిట్ హైదరాబాద్ సమీపంలో ఒక ఫామ్‌హౌస్‌లో 11 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. ఇది కూడా ఈ స్కామ్‌కు సంబంధించినదని తేలింది. వైసీపీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఐఎఎస్ అధికారులు ఈ కేసులో ఉన్నారు.
ఇప్పటి వరకు సిట్ విచారణ రాష్ట్ర స్థాయికే పరిమితమైంది. కానీ ఈడీ దర్యాప్తు మనీ లాండరింగ్ చట్టం కింద జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఇది డబ్బు మార్గాలను ట్రాక్ చేసి, రాజకీయ నాయకులు, అధికారుల పాత్రను బహిర్గతం చేస్తుంది. ఈ కేసు భవిష్యత్తు ఆంధ్ర రాజకీయాలపై ప్రభావం చూపిస్తుంది. ఈడీ విచారణలో మరిన్ని అరెస్టులు, ఆస్తుల స్వాధీనం జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో పోల్చితే, ఈ కేసు చాలా పెద్దది.