Jagan: జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్ ఆస్తుల అటాచ్ – ఈడీ కీలక నిర్ణయం..
వైసీపీ (YCP) అధినేత జగన్ (Jagan ) అక్రమాస్తుల కేసులో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. మని లాండరింగ్ (Money laundering) ఆరోపణలతో సంబంధమున్న దాల్మియా సిమెంట్స్ కంపెనీకి చెందిన రూ.793 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసింది. దీని ఫలితంగా, ఇప్పుడు ఆ ఆస్తులతో సంబంధించి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేపట్టాలన్నా ఈడీ అనుమతి తీసుకోవాల్సిందే. ఒక్కో రూపాయికి లెక్కలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిణామం జగన్‌కి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
దాల్మియా సిమెంట్స్ కంపెనీ (Dalmia Cement Company) ఏర్పాటుకు వైఎస్ రాజశేఖరరెడ్డి(Y.S. Rajasekhar Reddy) ప్రభుత్వ కాలంలో అనుమతి లభించింది. అప్పట్లో వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థకు, కడప జిల్లాలో 417 హెక్టార్లలో విస్తరించిన సున్నపురాయి ఖనిజాలు కేటాయించబడ్డాయి. ఇక్కడివరకు చూస్తే ఇది సాధారణ పెట్టుబడి లాగే కనిపిస్తుంది. కానీ, ఈ సంస్థ ద్వారా జగన్‌కు సంబంధించిన సంస్థలకు నిధులు చేరాయని ఈడీ ఆరోపిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే, దాల్మియా సంస్థ రఘురామ్ సిమెంట్స్‌లో (Raghuram cements) రూ.95 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. ఇది ఆసక్తికరమైన విషయం ఎందుకంటే, ఒక సిమెంటు కంపెనీ మరొక సిమెంటు కంపెనీలో పెట్టుబడి పెట్టడం సాధారణంగా జరగదు. అయినా వైఎస్ పాలనలో ఈ వ్యవహారం సాధ్యమైందని అనిపిస్తోంది. ఇది నీకు..ఇది నాకు అన్నంతగా అనుమతుల పంపకం జరిగినట్టు చెప్పొచ్చు.
అంతేకాదు, మని లాండరింగ్ రూపంలో రూ.55 కోట్లు కూడా జగన్‌కు చెందిన సంస్థల ఖాతాల్లోకి వెళ్లినట్టు ఈడీ తేల్చింది. అంటే మొత్తం కలిపి దాల్మియా సంస్థ రూ.150 కోట్ల మేర నేరుగా జగన్ కంపెనీలకు నిధులు అందజేసిందన్నమాట. ఈ వ్యవహారాలన్నింటిపై విచారణ జరిపిన ఈడీ, తాజాగా దాల్మియా సిమెంట్స్‌కు చెందిన రూ.793 కోట్ల ఆస్తులను అటాచ్ చేసి, దర్యాప్తులో కీలక ముందడుగు వేసింది.ఈ పరిణామంతో కేసులో తిరుగులేని ఆధారాలు సమకూరుతున్నట్టు కనిపిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఇది ముఖ్యమైన మలుపుగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.













