ఆంధ్రాలో హింసపై ఈసీ సీరియస్..15 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు.. పలువురు బదిలీ..
ఆంధ్రాలో పోలింగ్ పూర్తయిన రోజు రాత్రి నుంచి పలు ప్రాంతాలలో తీవ్ర హింస చెలరేగింది. ప్రధానంగా తాడిపత్రి, మాచర్ల, తిరుపతి నియోజకవర్గాలలో భారీ ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాలలో 144 సెక్షన్ ని కూడా కొనసాగించాల్సి వచ్చింది. ఈ అల్లర్లను సీరియస్ గా తీసుకున్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్.. పోలీసు శాఖపై తీవ్రంగా స్పందించింది. ఆంధ్రాలో పోలింగ్ తర్వాత అనూహ్యంగా చెలరేగిన హింస నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. అల్లర్లపై ఏపీ చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఇచ్చిన వివరణతో పల్నాడు కలెక్టర్ తో పాటుగా మొత్తం 15 మంది పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. పల్నాడు జిల్లా కలెక్టర్ పై బదిలీ వేటు వేసిన ఈసీ.. అనంతపురం, పల్నాడు ఎస్పీలను సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పి పై బదిలీ వేటుతో పాటు శాఖపరమైన విచారణకు కూడా ఆదేశాలు జారీ చేసింది.
ఇక హై టెన్షన్ జోన్స్ గా మారిన పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల పరిధిలోని 12 మంది సబర్డినేట్ పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత ఎటువంటి హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇందులో భాగంగా కౌంటింగ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో 15 రోజుల పాటు 25 కేంద్ర పారా మిలిటరీ బలగాలను కొనసాగించాల్సిందిగా కేంద్ర హోం శాఖకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.













