ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీయండి.. డిప్యూటీ సీఎం మాస్ వార్నింగ్..
నిన్న మొన్నటి వరకు రాజకీయం అంటే ఏమిటో తెలియదు అని అందరూ విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిజంగా రాజకీయమంటే ఏమిటి అనేది అందరికీ అర్థమయ్యేలా ప్రవర్తిస్తున్నారు. ఓట్ల కోసం అనేక మాటలు చెప్పి ఆ తరువాత ప్లేట్లు తిరగేసే నేతలను ఎందరినో చూసాం.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంతో నిబద్దతతో తన పనులు చేసుకుని పోతున్నారు. దీనికి నిదర్శనంగా ఈరోజు ఆయన దృష్టికి వచ్చిన తిరుపతి సంఘటన నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించి వాటికి సంబంధించిన పరిష్కారాల్ని అందివ్వడానికి ప్రయత్నిస్తున్నారు. శనివారం నాడు ఆయన కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. అధికారులతో సమావేశమైన తరువాత రాష్ట్రంలోని ప్రతి మూల నుంచి తన కార్యాలయానికి వచ్చిన అర్జీలను పరిశీలించారు. శనివారం సిబ్బందితో కలిసి తన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రతి అర్జీని చదివి వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలను వెతికే పనిలో ఉన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ శాఖల ఇలా ఎన్నో విషయాలకు సంబంధించిన అర్జీలు పవన్ కు చేరాయి. వీటికి సంబంధించిన సంబంధిత శాఖల అధికారులతో సమస్యల గురించి పవన్ స్వయంగా మాట్లాడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ కు తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వచ్చిన ఒక సమస్య అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డులో కొందరు యువకులు బైక్స్ మీద ప్రమాదకరంగా సంచరిస్తున్నారని.. యువతులను విద్యార్థినులు, ఆడవారిని వేధిస్తున్నారని ఆ లేఖలో రాశారు. ఈ బైకర్ల వల్ల వృద్ధులు కూడా తీవ్రమైన ఇబ్బందికి గురి అవుతున్నారని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా యువతుల ఫోటోలు తీసి ఇంటర్నెట్లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తామంటూ వారు బెదిరిస్తున్నట్లుగా లేఖలో ఫిర్యాదు చేశారు. కొందరైతే మద్యం తాగి మరి ఇళ్ళ మీదకు గొడవకు వస్తున్నారట. లేఖ తో పాటుగా యువకులకు సంబంధించిన వివరాలు, బైక్ నెంబర్ ప్లేట్లు, బైక్ మీద వారు తిరుగుతున్నప్పుడు తీసిన ఫోటోలను జత చేసి పంపారు. ఆడవారు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందిని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అని చాలా సీరియస్ అయ్యారు. వెంటనే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలని.. ఇలా ఆడపిల్లలపై, మహిళలపై వేధింపుకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.













