దువ్వాడ కు జగన్ షాక్.. టెక్కిలి ఇన్ ఛార్జ్ హోదా గోవిందా…
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల అనంతరం వైసీపీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దువ్వాడ కుటుంబం హై డ్రామా మరొక ఎత్తు. టీవీ సీరియల్ కు మించి.. ఎన్నో ట్విస్టులు ఆద్యంతం ఉత్కంఠత రేపిన దువ్వాడ కుటుంబ కథా చిత్రం అందరికీ తెలిసిందే. రోజుకు ఒక సరికొత్త ఎపిసోడ్ తో.. దువ్వాడ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో అండగా ఉంటాడు అనుకున్న వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దువ్వాడకు పెద్ద షాక్ ఇచ్చారు.
ఇటీవల తీవ్ర చర్చనీయాంశంగా మారిన దువ్వాడ శ్రీనివాస ఫ్యామిలీ వ్యవహారంపై ఎట్టకేలకు జగన్ మోహన్ రెడ్డి స్పందించినట్లు కనిపిస్తోంది. దువ్వాడ భార్య వాణి, దువ్వాడ ఇద్దరు వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్నికల సమయంలో కూడా ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ విషయం పక్కన పెడితే తన భర్త మాధురితో సహజీవనం చేస్తున్నారని.. దువ్వాడ వాణి ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రిని కలవడానికి వచ్చిన ఆడపిల్లలను అర్ధరాత్రి వరకు వీధిలో నిలబెట్టి దువ్వాడ ఎంత కసాయివాడో నిరూపించుకున్నాడు.
ఇక పలు కేసులు.. వాదోపవాదాలు, ఈ ఫ్యామిలీ డ్రామా లో నిత్యకృత్యాలుగా మారాయి. దువ్వాడ తన భార్య.. కుమార్తెల పై హైకోర్టులో కేసు వేశారు. రోజురోజుకి శృతిమించుతున్న దువ్వాడ వ్యవహారం పార్టీకి ముప్పు తెస్తుంది అన్న విమర్శ ఎప్పటినుంచో ఉంది. అయినా జగన్ పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ నియోజకవర్గ కేడర్ లో కూడా దువ్వాడపై అసంతృప్తి వెల్లువెత్తుతుంది. ఇదే విషయంపై పార్టీ సీనియర్ నేతలు జగన్ ను సంప్రదించారని కూడా టాక్. అందుకే టెక్కిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ బాధ్యతల నుంచి దువ్వాడను జగన్ తప్పించారు. ఆ బాధ్యతలు గతంలో టెక్కిలి సమన్వయకర్తగా వ్యవహరించిన పేరాడ తిలక్ కు అప్పగించారు. తిలక్ 2019 ఎన్నికల్లో టెక్కిలి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూశారు. 2024 ఎన్నికల్లో కూడా శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన తిలక్ ఓడిపోయారు..దీంతో తిలక్ ను టెక్కిలి అసెంబ్లీ స్థానానికి సమన్వయకర్తగా జగన్ నియమించారు. ఊహించని ఈ పరిణామానికి దువ్వాడ ఎలా స్పందిస్తాడో చూడాలి.













