శ్రీ పంచమి వేళ… సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనం
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ మాఘమాసం శుద్ధ పంచమి (శ్రీ పంచమి)ని పురస్కరించుకుని సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు, విద్యార్థులు, చిన్నారులు భారీగా తరలివచ్చారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. గర్భాలయంలో అమ్మవారి మూలవిరాట్‌తో పాటు, మహా గణపతి ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని సరస్వతీదేవిగా అలంకరించి హోమం నిర్వహించారు. అమ్మవారికి కలువ పూలతో నిర్వహించిన అర్చనలో చైర్మన్ పైలా సోమినాయుడు, ఈఓ భ్రమరాంబ పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో హోమంలో పాల్గొనేందుకు ఈ ఏడాది భక్తులెవరినీ అనుమతించలేదు. మరో వూపు అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేసిన విద్యార్థులకు ఈఓ భ్రమరాంబ, ప్రధాన అర్చకుడు లింగభొట్ల దుర్గా, ప్రసాద్ తదితరులు పెన్నులు, అమ్మవారి పాకెట్ సైజ్ ఫొటో, కంకణం, ప్రసాదాలను పంపిణీ చేశారు. పాలక మండలి సభ్యులు కటకం శ్రీదేవి, ఎన్. సుజాత, ఎన్.రాజ్యలక్ష్మి, ఏఈఓలు ఎన్.రమేష్ బాబు, వెంకటరెడ్డి, తిరుమలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
దసరా ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజు తర్వాత శ్రీ పంచమి రోజునే అమ్మవారిని సరస్వతిగా అలంకరిస్తారు. శ్రీ పంచమిని పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణం, నటరాజు స్వామి ఆలయం, మల్లేశ్వరాలయం, మహా మంపడం ఆరు, ఏడు అంతస్తుల్లో చిన్నారులతో తల్లిదండ్రులు అక్షరాభ్యాసాలు చేయించారు.













