Fee Reimbursement: ఫీజుల పేరుతో ఒత్తిడి వద్దు..కళాశాలలకు ప్రభుత్వ హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) పథకంలో కీలక ముందడుగు వేసింది. గత కొంతకాలంగా ఈ పథకంలో నిధుల జాప్యం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తమ వంతు బాధ్యతను నెరవేర్చేందుకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ బకాయిలను విడుదల చేసింది. ఇది వేలాది మంది విద్యార్థులకు ఊరట కలిగించే నిర్ణయంగా మారింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ.600 కోట్లను విడుదల చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అదనంగా మంజూరైన మొత్తమని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటికే మొదటి విడతలోగా రూ.788 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. త్వరలోనే మరో రూ.400 కోట్లు చెల్లించనున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ (Kona Sashidhar) స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, విద్యాసంస్థలు ఫీజులు చెల్లించలేదని విద్యార్థులపై ఒత్తిడి తెస్తూ, హాల్ టికెట్లు ఇవ్వకుండా, సర్టిఫికెట్లను ఆపేసిన ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని స్పష్టం చేసింది. విద్యాసంస్థలు తాము ఇవ్వాల్సిన ఫీజులు ఇప్పుడే పూర్తిగా వస్తున్నాయని తెలిసినప్పటికీ, మళ్లీ అదే ఒత్తిడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.
ప్రభుత్వం ఈ బకాయిలను దశలవారీగా చెల్లిస్తుందన్న స్పష్టతనిచ్చింది. దీంతో కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి చేయకుండా, వారికి సౌకర్యం కల్పించాలని సూచించింది. ముఖ్యంగా పరీక్షల సమయంలో హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వకపోవడం వంటి చర్యలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతున్నాయని ప్రభుత్వం గమనించింది.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. విద్యార్థులు తమ విద్యను నిరభ్యంతరంగా కొనసాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య విద్యార్థులపై పడుతున్న ఒత్తిడిని తగ్గిస్తుందని అందరూ భావిస్తున్నారు.