ప్లాస్మా దానం..ప్రతిజ్ఞ చేయాలి: ఏపీ గవర్నర్
కోవిడ్ -19 వైరస్ బారి నుండి పూర్తిగా కోలుకున్న వారు వారి ప్లాస్మాను దానం చేసి, వైరస్ సోకి పోరాడుతున్న రోగులకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు కోవిడ్ ను జయించిన వారు కరోనా సంక్షోభాన్ని అధిగమించడంలో ప్రభుత్వానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని కోరారు. కరోనాపై పోరులో ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో మెలగాలని సూచించారు. కోవిడ్ -19 మహమ్మారి వలన దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటున్న విషయం మీ అందరికి తెలిసిందేనని, కరోనా వైరస్ ప్రజలకు అపారమైన నష్టాన్ని, సాధారణ జన జీవనానికి భంగం కలిగించిందన్నారు. ప్రభుత్వ అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించి, కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు. సాధ్యమైనంతవరకు ఇళ్ళల్లోనే ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించారు.
అలాగే సామాజిక దూరం పాటించడం, సబ్బు లేదా శానిటైజర్‌తో తరచు చేతులు కడుక్కోవడం, బహిరంగ ప్రదేశాలలో ఫేస్ మాస్క్ ధరించడం ద్వారా కోవిడ్ ను విజయవంతంగా ఎదుర్కోవచ్చునన్నారు. భారతదేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన శుక్రవారం రాష్ట్ర ప్రజలకు సందేశం అందించారు. మన దేశ స్వాతంత్ర్య సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరులను, స్వాతంత్ర్య సమర యోధులను, దేశ భక్తులను గుర్తు చేసుకునే సందర్భం ఇదన్నారు. స్వాతంత్ర్య స్వేచ్ఛా ఫలాలను అందించిన అమర వీరుల ఆశయాలకు అనుగుణంగా సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావంతో, దేశ పురోగతికి ధృడ నిశ్చయంతో పునరంకితమవుదామన్నారు.













