తిరుపతిలో రూ.150 కోట్ల పెట్టుబడితో డిక్సన్
ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో మరో ఎలక్ట్రానిక్ పరిశ్రమ ప్రారంభమైంది. ఎల్ఈడీ బల్బులు, టీవీలు, సీసీ కెమెరాలు, వాషింగ్ మెషీన్లు తయారు చేసే డిక్సన్ తిరుపతిలో ఉత్పత్తి ప్రారంభించింది. రూ.150 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉపాధి కల్పించే ఈ ప్లాంటు నిర్మాణాన్ని డిక్సన్ యాజమాన్యం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, కేవలం ఏడాదిలోనే పూర్తి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని ప్రారంభించారు.
ఈ ప్రాంతం మూడేళ్ల క్రితం ఎలా ఉండేదో, ఇప్పుడెలా ఉందో చూడండి. తిరుపతిని ఎలక్ట్రానిక్, హార్డ్‌వేర్ హబ్‌గా మారుస్తాం. ఈ నగరానికి మరిన్ని సంస్థలు తరలి వస్తాయి. తిరుపతిని చైనాలోని ప్రఖ్యాత నగరి షెన్జెన్ నగరంగా రూపుదిద్దుతాం అని చంద్రబాబు తెలిపారు. భారీ పరిశ్రమలను రప్పించేందుకు ఇన్నేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులతో 32 వేల మందికి ఉద్యోగవకాశాలు కల్పించే లక్ష్యంతో అనేక సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్టు చెప్పారు. డిక్సన్ కంపెనీ శరవేగంగా పనులు పూర్తిచేసి ఇంత మందికి ఉద్యోగాలు కల్పించడం హర్షణీయమన్నారు. సౌకర్యాలు కల్పిస్తే తమ సంస్థను మరింత విస్తరిస్తామని డిక్సన్ చైర్మన్ చెప్పారని, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హార్డ్‌వేర్, మొబైల్ క్లస్టర్లకు దేశంలోనే తిరుపతి మొదటి స్థానంలో ఉందని అన్నారు. చైనాకు చెందిన టీసీఎల్ ఇండస్ట్రీ కూడా చిత్తూరు జిల్లాను రానుందని చంద్రబాబు తెలిపారు. దీనిద్వారా ఆరు వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. చిత్తూరు జిల్లాలో జియో ద్వారా 20వేలు, ఫాక్స్‌కాన్ తదితర కంపెనీల ద్వారా 59 వేల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. 50 శాతం హార్డ్ వేర్ సంస్థలు ఏపీకి వచ్చేలా బాధ్యతలు తీసుకుంటామన్నారు.













