District Judiciary: న్యాయం కోసం అందరూ మొదట అక్కడికే వెళ్తారు
న్యాయవ్యవస్థలో జిల్లా జ్యుడీషియరీ (District Judiciary) వ్యవస్థ మూల స్థంభం అని, ప్రతి వ్యక్తి మొదటగా జిల్లా న్యాయ వ్యవస్థ వద్దకే వస్తారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (Prashant Kumar Mishra) అన్నారు. గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (Acharya Nagarjuna University) సమీపంలోని జ్యుడీషియల్ అకాడమీలో నిర్వహించిన రాజ్యాంగ ధృక్కోణం-జిల్లా న్యాయ వ్యవస్థ పాత్ర అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ రాజ్యాంగంలో జిల్లా న్యాయ వ్యవస్థకు ఉత్తమ స్థానం కల్పించారని పేర్కొన్నారు. ఉత్తమ న్యాయం అందించడమే న్యాయవ్యవస్థ ప్రధాన విధిగా గుర్తించాలని సూచించారు. కోర్టుల్లో (Court) జరిగే విచారణ సామాన్యుడికి సైతం అర్థం కావాలని, అప్పుడే న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం, నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. తీర్పులు ఇవ్వడం ఒక్కటే న్యాయ వ్యవస్థ ప్రక్రియ కాదని, ఆ తీర్పులో నిబద్ధత ఉండాలని అన్నారు. న్యాయం అనేది మానవతా దృక్పథంపై ఆధారపడి ఉంటుందన్నారు.






