ఇసుక కొరత…ఆర్టీసీ ఛార్జీల పెంపుతో జగన్ ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ రవాణా చార్జీల పెంపు ప్రతిపాదనలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఇసుక కొరత, మద్యం ధరల పెంపుతో ప్రభుత్వం పట్ల అసంతప్తి వ్యక్తమైంది. వందకుపైగా సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా వాటి వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలకంటే ఇసుక కొరత వార్ని అధికంగా పీడిస్తోంది. పరోక్షంగా ఇది సమాజంలోని అన్నివర్గాల ఉపాధిని దెబ్బతీస్తోంది. ఈ దశలో పేద, మధ్యతరగతి ప్రజలంతా వినియోగించే ఆర్టీసీ బస్సుల రవాణా చార్జీల్ని పెంచితే ప్రభుత్వానికిది మరింత అప్రతిష్ట తేవడం ఖాయమని అంటున్నారు. ప్రజారవాణా వ్యవస్థను ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు తమ సామాజిక బాధ్యతగా పరిగణిస్తున్నాయి. కానీ మన దేశంలో ఈ వ్యవస్థను లాభనష్టాల వ్యాపారంగా ప్రభుత్వాలు చూస్తున్నాయి. వీటిపై వచ్చే ఆదాయం, జరిగే వ్యయానికి మధ్య వ్యత్యాసానికనుగుణంగా ఎప్పటికప్పుడు ధరలు పెంచుతున్నాయి. ఇటీవలె తెలంగాణా ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసింది. ఆ రాష్ట్రంలో ఆర్టీసీని పటిష్టమైన సంస్థగా రూపుదిద్దే ప్రయత్నం మొదలైంది. అక్కడ ఏటా వస్తున్న 1200 కోట్ల నష్టాల్ని అధిగమించడంతో పాటు వచ్చే ఏడాది నాటికి సింగరేణి తరహాలో కార్మికులందరికీ బోనస్లివ్వాలన్న ప్రతిపాదన ప్రభుత్వం చేసింది. ఇందుకనుగుణంగా రవాణా చార్జీల్నిపెంచింది.
కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకొస్తూనే జగన్ ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేయాలన్న ప్రతిపాదన పెట్టింది. దీనిపై అధ్యయనానికి నిపుణులు, మంత్రులతో వేర్వేరుగా కమిటీలు నియమిచింది. ఏపీలో రేపోమాపో ఆర్టీసీ ప్రభుత్వంలో భాగమౌతుంది. ఆ తర్వాత రవాణా శాఖలో ఒక విభాగమౌతుంది. దీంతో ఇక ఆర్టీసీలో లాభనష్టాలంటూ ప్రత్యేక పట్టికలుండవు. దీనికొచ్చే ఆదాయం రవాణాశాఖలో ఓ భాగమౌతుంది. అలాగే ఖర్చు కూడా ఆ శాఖే భరిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రవాణా శాఖ ఆదాయం రోజురోజుకు పెరుగుతోంది. వాహనాల రిజిస్ట్రేషన్ నుంచి పన్నుల వరకు ఈ శాఖ ఆదాయంలో దూసుకుపోతోంది. గతకొంతకాలంగా ఈ శాఖ వసూలు చేస్తున్న అపరాధ రుసుంలు కూడా ఏటా వందల కోట్లకు చేరాయి. ఈ దశలో రవాణాశాఖకు నష్టాలుండే ప్రసక్తేలేదు. ఆర్టీసీ కూడా రవాణాశాఖలో భాగమైతే ఈ సంస్థ కూడా లాభాల్నే నమోదు చేసే అవకాశముంటుంది. కానీ తెలంగాణాలో పెంపును దష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా చార్జీల మోత మ్రోగించాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇది ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సొంత పార్టీలో కూడా అనుమానం వ్యక్తమౌతోంది.













