తెర వెనుక నుంచి తెరమీదకు రాబోతున్న చంద్రబాబు, వైయస్సార్ దోస్తానా..
సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉన్న విషయం మనకు తెలిసిందే. ఎందరో సినీ ప్రముఖులు రాజకీయ రంగ ప్రవేశం చేసి నాయకులుగా ప్రజలను మెప్పించారు. మరోపక్క ఎందరో రాజకీయ నాయకుల చరిత్రను సినిమాలుగా చిత్రీకరించి డైరెక్టర్లు ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఇప్పుడు సరికొత్తగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో సంచలనమైన వైయస్సార్, చంద్రబాబు మధ్య అసలు స్టోరీని తెరకెక్కించబోతున్నారు.
ఆంధ్ర రాజకీయాలలో గత కొన్ని సంవత్సరాలుగా రెండు కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. మొదట్లో స్నేహితులుగా ఉన్న ఇద్దరు మిత్రులు రాజకీయ రంగ ప్రవేశం ఒకే పార్టీ నుంచి చేశారు. అనంతరం వారి దారులు వేరయ్యాయి.. కాలక్రమమైన రాజకీయం కాస్త రంగు మార్చుకొని కక్ష సాధింపు చర్యల వరకు వెళ్ళింది. అయితే ఇదంతా తెర ముందు జరిగే బాగోతం.. తెర వెనుక అసలు దీనికి ముఖ్య కారణం ఏమిటి అన్న విషయంపై పలు రకాల కథనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన కథ చూడబోతున్నాం.. చేసిన సినిమాలు అతి తక్కువ అయినప్పటికీ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకొన్న దేవకట్టా ఈ స్టోరీ తెరకెక్కించబోతున్నారు. కెరీర్లో కమర్షియల్ సక్సెస్ లో లేకపోయినప్పటికీ తాను అనుకున్న కథను ప్రేక్షకుల మనసుకు హత్తుకునే విధంగా చూపించడంలో దేవకట్టా దిట్ట. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి దేవకట్ట ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు.
ఈ వెబ్ సిరీస్ కాలేజీ రోజులలో చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ని బేస్ చేసుకుని ముందుకు సాగుతుంది. ఇప్పటికే సిరీస్ కి సంబంధించిన షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు టాక్.ఆది పినిశెట్టి, చైతన్య రావు కాంబినేషన్ లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. రాజకీయానికి ,కాలేజీకి మంచి దోస్తీ ఉంది.. ఇక ఒకప్పటి చంద్రబాబుకి, రాజశేఖర్ రెడ్డి మధ్య దోస్తానా కూడా చాలా బలమైనది అంటున్నారు కొందరు. దీంతో రాబోయే ఈ వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు.
ఏది ఏమైనాప్పటికీ మరొకసారి తిరిగి ఇది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే యాత్ర, యాత్ర 2 లాంటి సినిమాలు రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని హైలైట్ చేస్తూ వచ్చాయి.. మరోపక్క ఎన్టీఆర్ జీవిత చరిత్ర అంటూ తీసిన కొన్ని సినిమాలలో చంద్రబాబు నాయుడు గురించి కాస్త తక్కువగా చూపించారు. అయితే రాబోయే ఈ వెబ్ సిరీస్లో చంద్రబాబుకు సంబంధించిన పాజిటివ్ కోణాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించే అవకాశం ఉంది అని అందరూ భావిస్తున్నారు.













