జూన్ 2 నుంచి విదేశీ సర్వీసులు…

కొవిడ్ నేపథ్యంలో చేపడుతోన్న వందే భారత్ మిషన్ లో భాగంగా జూన్ 2వ తేదీ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విదేశీ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రవాసాంధ్రులు అధికంగా ఉండే కువైట్, మస్కట్, సింగపూర్‍ల నుంచి తొలుత ఈ సర్వీసులు ప్రారంభించనున్నారు. ఆదివారం మినహా ఇతర రోజుల్లో నిత్యం ఒకటి, రెండు సర్వీసులు రాష్ట్రానికి చేరనున్నాయి. ఇప్పటి వరకు ఢిల్లీ మీదుగా ఈ సర్వీసులు ఉండేవని, ఇప్పుడు ఆయా దేశాల నుంచి నేరుగా ఇక్కడికి చేరుకోనున్నట్లు విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదనరావు తెలిపారు. విజయవాడ నుంచి కూడా నేరుగా ఆయా దేశాలకు ప్రయాణికులను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. జులై 1వ తేదీ నుంచి ఈ పక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.