కాంగ్రెస్ ఆధికారంలోకి రాగానే ఆ హామీ అమలు : దిగ్విజయ్ సింగ్
తెలంగాణ దాటితే మిగతా రాష్ట్రాల్లో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఎక్కడుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. ఏపీలో భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. కాంగ్రెస్ యాత్రకు హృదయపూర్వక స్వాగతం పలికిన ఏపీ ప్రజలకు దిగ్విజయ్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం తమకే సాధ్యమని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి రాగానే ఆ హామీ అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇదే హామీతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని వివరించారు. తెలంగాణ విషయంలో హామీని నిలబెట్టుకున్నామని, ఏపీకి ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకుంటామని తెలిపారు. ఈ విషయంలో బీజేపీ పార్టీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రులను మోసం చేశారని ఆరోపించారు.
రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని విమర్శించారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించాక ప్రత్యేక రాష్ట్రం ఎందుకు ఇచ్చామనే విషయం స్వయంగా రాహుల్ గాంధీనే చెబుతారని తెలిపారు. విద్వేష రాజకీయాలు, హింసపై పోరాటంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని తెలంగాణ ప్రజలను ఆయన కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కోరికలు ఎక్కువవుతున్నాయని విమర్శించారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందేనని అన్నారు.













