టీటీడీ తాత్కాలిక ఈవోగా ధర్మారెడ్డి… ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డికి తాత్కాలికంగా ఈవో బాధ్యతలు అప్పగిస్తూ ఏపీ సర్కార్ ఉత్దర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ ఈవో బాధ్యతల్లో ఉన్న జవహర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం ‘స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోలర్ సెంటర్ చైర్మన్’ గా నియమించింది. దీంతో జవహర్ రెడ్డి బాధ్యతలను అదనపు ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ధర్మారెడ్డికి ప్రభుత్వం బాధ్యతలు అప్పజెప్పింది. గతంలోనూ ధర్మారెడ్డి తాత్కాలికంగా ఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఈవోగా బాధ్యతలు నిర్వర్తించిన అశోక్ సింఘాల్‌ను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో ధర్మారెడ్డి టీటీడీ సంయుక్త ఈవో బాధ్యతల్లో ఉన్నారు. నూతన ఈవో బాధ్యతలు స్వీకరించే వరకూ తాత్కాలికంగా ఈవో బాధ్యతలు నిర్వర్తించాలంటూ ఏపీ ప్రభుత్వం ధర్మారెడ్డిని ఆదేశించింది. ఈ తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి ఈవోగా పూర్తి బాధ్యతలు చేపట్టారు.













