టీటీడీ జేఈవోగా ధర్మారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈవోగా కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఏవీ ధర్మారెడ్డి నియమితులు కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయన డిప్యుటేషన్‌పై పనిచేసేందుకు ఆమోదముద్ర వేస్తూ కేంద్రం ఉత్తర్వు జారీ చేసింది. 2022 మే 14 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై ఉంటారని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది.
1991 బ్యాచ్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ (ఐఈడీఎస్)కు చెందిన ధర్మారెడ్డి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన టీటీడీ జేఈవో, ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో టీటీడీకి ధర్మారెడ్డి చేసిన సేవలకు మెచ్చిన సీఎం జగన్.. ఆయనకు మరోసారి తిరుమలలో పనిచేసే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇటీవల బదిలీ అయిన జేఈవో శ్రీనివాసరాజు స్థానంలో ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. ఇప్పుడు ధర్మారెడ్డికి కేంద్రం క్లియరెన్స్ ఇవ్వడంతో ఆయనకు టీటీడీ జేఈవోగా బాధ్యతలు అప్పగించే వీలుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.













