భయపడాల్సిన పనిలేదు…డిజిపి
లండన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ భరోసా ఇచ్చారు. కోవిడ్ 19 కారణంగా ఈనెల 20 నుంచి అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో చివరి నిమిషంలో హిత్రూ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఆంధప్రదేశ్‌కు చెందిన పలువురు విద్యార్థులు, ప్రయాణికులు ప్రస్తుతం లండన్‌లోనే ఉంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారితోపాటు ఏపీకి చెందిన 29 మంది అక్కడే ఉండిపోయారు. విమానాలు నిలిపివేయడంతో తామంతా అక్కడ చిక్కుకుపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ ఎన్ఆర్టీ కంట్రోల్ రూమ్, సీఐడీ ఎన్ఆర్ఐ సెల్‌కు వారు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన డీజీపీ సవాంగ్ ఏపీ సీఐడీ (ఎన్ఆర్ఐ సెల్), ఏపీ ఎన్ఆర్టీల సమన్వయంతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడారు. ప్రస్తుతం భయపడాల్సిన పనిలేదన్నారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు.













