Devineni: బెజవాడ మేయర్ అభ్యర్ధిగా దేవినేని వారసుడు..?

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో, పదవుల విషయంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు అలాగే మేయర్ల విషయంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ, ఏ నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపై అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆసక్తిని రేపే విజయవాడ(Vijayawada) మేయర్ పదవికి సంబంధించి ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవాడ మేయర్ స్థానాన్ని టిడిపి కోల్పోయింది.
ఆ ఎన్నికల్లో వైసిపి గెలవడంతో మేయర్ గా, రాయని భాగ్యలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రస్తుతం టిడిపి ఎన్నికలపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. అయితే ఈసారి మేయర్ పదవిని ఎవరికి ఇవ్వాలి అనే దానిపై, అధిష్టానం ఇంకా క్లారిటీకి రాలేదు. అయితే ప్రస్తుతం విజయవాడలో వస్తున్న వార్తల ప్రకారం, దేవినేని చంద్రశేఖర్ కు మేయర్ పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే అన్ని కార్పొరేటర్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే సర్వేలు చేయించుకోవాలని, వర్క్ మొదలు పెట్టాలని కూడా దేవినేని చందూకు అధిష్టానం చెప్పినట్లు తెలుస్తోంది.
మంత్రి నారా లోకేష్(Nara Lokesh) నుంచి చంద్రశేఖర్ కు ఈ హామీ వచ్చినట్లుగా రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇతర టిడిపి నాయకులు నుంచి కూడా ఈ విషయంలో పెద్దగా వ్యతిరేకత రాలేదు. అటు ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంలో చందూకు సహకరిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేసీనేని చిన్ని కూడా ఈ విషయంలో అధిష్టానం నిర్ణయానికి జై కొట్టినట్లు సమాచారం. చంద్రశేఖర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాలవల్ల ఆయన పోటీ చేయలేకపోయారు. ఆయన తల్లి అపర్ణ ప్రస్తుతం విజయవాడ కార్పొరేటర్ గా ఉన్నారు. ఆమె గతంలో నూజివీడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని కారణాలతో ఆమెకు సీటు రాలేదు. ఇక ప్రస్తుతం దేవినేని చంద్రశేఖర్ ఏ పదవి లేకుండా ఖాళీగా ఉన్నారు. ఆర్థికంగా కూడా బలమైన నేత కావడం, బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో.. టిడిపి అధిష్టానం ఈ విషయంలో ముందడుగు వేస్తున్నట్లు సమాచారం.