స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం తాకట్టు : దేవినేని
స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరాన్ని తాకట్టు పెడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో దేవినేని మీడియాతో మాట్లాడుతూ సీబీఐ, ఈడీ, బాబాయి హత్య కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ రాజీపడి కేంద్రం ముందు నోరెత్తలేదని విమర్శించారు. రివర్స్ డ్రామా ఆడకుంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది అన్నారు. పోలవరం నిర్వాసితుల ద్రోహిగా సీఎం జగన్ మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పునరావవాసం కింద దాదాపు లక్ష కుటుంబాలకు కట్టాల్సిన ఇళ్లపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి పర్యటనలో రూ.47,725 కోట్లు ఇస్తే చాలని రాజీపడటంలో పిరికితనం ఏంటి అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం ఏం మాట్లాడతారు, కేంద్ర మంత్రి ఏం చెప్పారని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తూంటే మంత్రులు కార్ పార్కింగ్ గొడవకి పరిమితమయ్యారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పరిశీలనకు వస్తే రాష్ట్ర జలవనరుల మంత్రి అడ్రస్సు లేదన్నారు. కావాల్సినవి అడగడంలో సీఎం జగన్ విఫలమయ్యారు. 28 మంది ఎంపీలు ఉండి ఆర్థిక అనుమతులు పొందలేకపోయారు మండిపడ్డారు.













