వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి.. ఇది నిదర్శనం : దేవినేని ఉమా
జగన్ అవినీతి, నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు అనిశ్చితిలోకి వెళ్లిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో పనిచేసిన మంత్రులు తమకు అసలు ప్రాజెక్టు కట్టే తీరే అర్థం కాలేదని చెప్పడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఐదేళ్లలో ఎలాంటి పురోగతి లేకపోగా కనీసం రక్షణ చర్యలు కూడా తీసుకోకుండా కట్టిన నిర్మాణాలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. 2020లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే నాలుగేళ్లుగా దానిపై ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేస్తామని గతంలో అసెంబ్లీ మాట్లాడిన మాటలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ నాటకమాడారని ఆరోపించారు. ప్రజా శ్రేయస్సు గురించి ఆయన పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.













